దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం నాడు విచారణ జరిపింది. అయితే, మరణశిక్ష అమలుకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం అభిప్రాయం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.ఉరి ద్వారా మరణశిక్ష బదులు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా శిక్ష అమలు చేయాలని లేదా, దోషి ఏ విధంగా తనకు మరణశిక్ష అమలు చేయాలో ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని పిటిషనర్ తన పిటిషన్ లో కోరారు.ఉరి ద్వారా మరణం క్రూరమైనది, అనాగరికమైనదని, ఉరి వేసిన తర్వాత దోషి మరణానికి చాలా సమయం పడుతుందని. అందువల్ల దాని బదులు నవీన పద్ధతుల్లో ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి శిక్ష అమలు చేయవచ్చునని పిటిషనర్ తరుపు న్యాయవాది రిషి మల్హోత్రా అన్నారు. సైన్యంలో దోషి అలాంటి ఆప్షన్ ఎన్నుకునే వీలు ఉందన్నారు. అమెరికా లోని
50 స్టేట్ లలో కనీసం 40 స్టెట్ లలో ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు అవుతున్నదని ,దీని వల్ల ఉరి తీసిన తర్వాత ఆ జీవి చాలా సేపు అనుభవించే వేదన నుంచి విముక్తి లభించవచ్చు నని పిటిషనర్ తరుపు న్యాయవాది వివరించారు.ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో దోషికి అలాంటి ఆప్షన్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చుకునేందుకు సిద్ధంగా లేదని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఉరి తీయడం ద్వారా మరణశిక్ష అమలు చాలా పాత విధానం. కొద్ది కాలంగా పరిస్థితులు మారిపోయాయి. సమస్య ఏమిటంటే, ప్రభుత్వం మార్పును అంగీకరించేందుకు సిద్ధంగా లేదు అని ధర్మాసనం పేర్కొంది.కేంద్ర ప్రభుత్వం తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్ మాట్లాడుతూ, ఖైదీలకు ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడంలో విధానపరమైన నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. కేసు విచారణ నవంబర్ 11 కు వాయిదా పడింది.