ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో దెబ్బే.. సర్వేలో షాకింగ్ నిజాలు – Telugu News | E20 Petrol Side Effects: Why Indian Drivers Face Higher Costs and Damage video TV9D – Business Videos in Telugu

ఈ అంశంపై లోకల్‌సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్‌ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ సరఫరా అవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఇంధనం వాడిన తర్వాత వాహనాల్లో సమస్యలు మొదలయ్యాయని పెద్దసంఖ్యలో ప్రజలు అభిప్రాయపడుతున్నారు. లోకల్‌సర్కిల్స్ సంస్థ దేశంలోని 323 జిల్లాల్లో 36 వేల మందికి పైగా వాహన యజమానులతో మాట్లాడి సర్వేను రూపొందించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 2022కు ముందు కొనుగోలు చేసిన వాహనాలు ఉన్న ప్రతి పది మందిలో ఎనిమిది మంది, ఈ20 పెట్రోల్‌తో మైలేజీ దారుణంగా తగ్గిపోయిందని తెలిపారు. దీంతో ఇంధన ఖర్చులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, వాహనాల మరమ్మతులు కూడా భారీగా పెరిగాయని సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 52 శాతం మంది తమ వాహనాలకు రిపేర్లు ఎక్కువయ్యాయని చెప్పారు. ఇంజన్ పనితీరు దెబ్బతినడం, ఫ్యూయల్ ట్యాంకులు పాడవడం, కార్బ్యురేటర్లలో సమస్యలు రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా మూడేళ్లు దాటిన పాత వాహనాల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు స్పష్టమైంది. ఆగస్టులో నిర్వహించిన సర్వేలో కేవలం 28 శాతం మందే రిపేర్ల గురించి ఫిర్యాదు చేయగా, అక్టోబర్‌ నాటికి ఈ సంఖ్య 52 శాతానికి చేరడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. వాహనదారుల ఆందోళనలను మెకానిక్‌లు కూడా ధ్రువీకరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్ సంబంధిత రిపేర్లు సుమారు 40 శాతం పెరిగాయని వారు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాల్లో ఫ్యూయల్ ఇంజెక్టర్లు చెడిపోవడం, ఆయిల్ ట్యాంకులు తుప్పు పట్టడం వంటి కేసులు పెరిగాయని వారు వివరించారు. చెన్నైకి చెందిన ఓ లగ్జరీ కారు యజమాని .. ఈ20 పెట్రోల్ వల్ల తన కారులోని ఇంధనం నీరుగా మారిపోయిందని, దాని రిపేరుకు ఏకంగా రూ. 4 లక్షలు ఖర్చయిందని వాపోయారు. అయితే ప్రభుత్వం వెర్షన్‌ మరోలా ఉంది. స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఈ20 ఒక కీలకమైన అడుగు అంటోంది. దీనివల్ల రైతులకు ఆర్థికంగా మేలు జరగడంతో పాటు, ముడి చమురు దిగుమతులు తగ్గుతాయని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇథనాల్ మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. అయితే, ప్రభుత్వ లక్ష్యాలు ఎలా ఉన్నా, క్షేత్రస్థాయిలో వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైకుపై రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. ఆ తర్వాత

భారత్‌లో అప్ఘాన్ మంత్రి.. వణుకుతున్న పాక్

ఏనుగుల గుంపు బీభత్సం.. నిద్రపోతున్నవారిపై దాడి

ఉపవాసం ఉన్న మహిళ.. గుండెపోటుతో కర్వాచౌత్‌ నాడు మృతి

యుద్ధాలు ఆపడంలో నేనే తోపు.. మరోసారి ట్రంప్ సొంత డబ్బా

 

Leave a Comment