ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దాం: సీఎం చంద్రబాబు

రేపు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన
శ్రీశైలం, కర్నూలులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని
రూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చేపట్టనున్న శ్రీశైలం, కర్నూలు పర్యటనలను అత్యంత విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతోందని, దానికి నిదర్శనమే ఇటీవలి గూగుల్ ఒప్పందమని ఆయన అన్నారు.

ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్ ప్రత్యేక చొరవతోనే గూగుల్ సంస్థ రాష్ట్రానికి ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందం వెనుక ఐటీ మంత్రి నారా లోకేశ్‌ కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు, దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని ఆయన గుర్తుచేశారు.

గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, వాటిని సరిదిద్దడానికే చాలా సమయం పట్టిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పారు. రాయలసీమను పారిశ్రామిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు.

రేప‌టి పర్యటనలో ప్రధాని మోదీ రూ.13 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని సీఎం వివరించారు. కర్నూలులో జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ః కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున హాజరవుతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కూటమిలోని మూడు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.

The post ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దాం: సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra.

Leave a Comment