Cigarettes with Tea: ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా? ఐతే మీకు యమలోకానికి టికెట్ కన్ఫార్మ్

Cigarettes with Tea: ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా? ఐతే మీకు యమలోకానికి టికెట్ కన్ఫార్మ్

నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ టీ తాగే అలవాటు ఉంది. నిద్ర లేచింది మొదలు రోజు మొత్తంలో కప్పుల కొద్దీ టీ లాగించేస్తుంటారు. మరికొంత మందికి టీతో పాటు సిగరెట్లు కాల్చడం అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది క్రమంగా శరీరాన్ని లోపలి నుంచి క్షీణింపజేస్తుంది. ముఖ్యంగా కార్పొరేట్ కల్చర్‌లో టీ తాగుతూ సిగరెట్లు కాల్చడం ఒక ట్రెండ్‌గా మారింది. కొందరు దీనిని స్టేటస్ సింబల్‌గా కూడా భావిస్తుంటారు. బ్రేక్‌ టైంలో చాలా మంది ఒత్తిడిని తగ్గించడానికి సిగరెట్లు తాగుతూ, టీ లేదా కాఫీ తాగడం చాలా సందర్భాల్లో మీరూ చూసే ఉంటారు.

అయితే, ఈ అలవాటు గురించి నిపుణులు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టీలోని కెఫిన్, సిగరెట్లలోని నికోటిన్ ఉంటుంది. ఈ రెండింటి కలయిక శరీరానికి చాలా హానికరం. ఇది క్రమంగా మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందని నిపుణులు అంటున్నారు. ధూమపానం ఊపిరితిత్తులకు ప్రమాదకరం. కానీ టీ లేదా కాఫీ వంటి కెఫిన్ కలిగిన పానీయాలతో ధూమపానం చేసినప్పుడు ఈ ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నికోటిన్, కెఫిన్ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోకి నికోటిన్ శోషణను గణనీయంగా పెంచుతుంది. ఇది శరీరానికి ఎక్కువ హాని కలిగిస్తుంది. ఈ కలయిక హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది రక్తపోటును కూడా పెంచుతుంది.

దీనివల్ల కార్డియాక్ అరిథ్మియా, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా హానికరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం టీ తాగుతూ సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులలో ఆక్సీకరణ ప్రక్రియలు పెరుగుతాయి. ఇది రెట్టింపు నష్టాన్ని కలిగిస్తుంది. టీ, సిగరెట్లు కలిపి తాగే అలవాటు ఉన్నవారికి కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వారికి ఒత్తిడి, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. టీ-సిగరెట్లు అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని 30 శాతం వరకు పెంచుతాయి.

టీలో యాంటీఆక్సిడెంట్లు అనే ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివిగా భావిస్తారు. అయితే ధూమపానం చేస్తున్నప్పుడు టీ తాగడం వల్ల ఈ పోషకాలు నాశనమవుతాయి. కాబట్టి టీ, సిగరెట్ల హానికరమైన అలవాటును వెంటనే మార్చుకోవడం అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాటును క్రమంగా మానేయడానికి ప్రయత్నించాలి. ముందుగా మీరు తాగే టీ లేదా కాఫీ మొత్తాన్ని క్రమంగా తగ్గించి, ఆపై పూర్తిగా మానేయాలి. ఆ తర్వాత క్రమంగా ధూమపానం మానేయడం ప్రారంభించాలి. ఉదాహరణకు మీరు రోజుకు ఐదు నుంచి ఏడు సిగరెట్లు తాగితే దానిని క్రమంగా తగ్గించాలి. ధూమపానం చేసేవారి సహవాసాన్ని నివారించడం ఈ అలవాటును మానుకోవడానికి ఒక ప్రభావవంతమైన మార్గం. శరీర అలసట, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగించే టీ, సిగరెట్ల కలయిక మీ ఆరోగ్యానికి చాలా హానికరం. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడే ఈ అలవాటు మానేయడం మంచిది.

గమనిక: ఇందులో అందించిన విషయాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. మేము వాటిని నిర్ధారించడం లేదు. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

[

Leave a Comment