రాలిపోతున్న స్టార్‌లింక్ ఉపగ్రహాలు | Starlink Satellites Falling

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహాలు తరచూ భూవాతావరణం లోకి పడిపోతుండడంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల భూకక్ష భద్రతకు ముప్పు కలిగించే ఖగోళ వ్యర్థాల చైన్ రియాక్షన్ ఉండే అవకాశం ఉందని స్మిత్సోనియన్ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు ఒకటి నుంచి రెండు స్టార్‌లింక్ ఉపగ్రహాలు భూ వాతావరణం లోకి ప్రవేశిస్తున్నాయని, ముందుముందు భూమిపై రాలిపోతున్న స్టార్‌లింక్ ఉపగ్రహాల సంఖ్య రోజుకు 5 వరకు పెరగవచ్చని తెలిపారు. భవిష్యత్తులో స్పేస్‌ఎక్స్, అమెజాన్ చేపట్టిన ప్రాజెక్టు కైపర్, చైనాకు చెందిన మరిన్ని ఉపగ్రహాలు కక్ష లోకి ప్రవేశించడంతో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కక్షలో 8 వేలకు పైగా స్టార్‌లింక్ ఉపగ్రహాలు ఉన్నాయని, చైనా మరో 20 వేల ఉపగ్రహాలను కక్ష లోకి ప్రవేశ పెడుతుందనే అంచనా వేస్తున్నట్టు తెలిపారు. స్టార్‌లింక్ ఉపగ్రహ జీవితకాలం దాదాపు ఐదునుంచి ఏడేళ్లు ఉంటుందని, అనంతరం వాటంతట అవే కక్ష నుంచి తొలగి భూమిపై రాలిపోతాయన్నారు.

ఒక్కోసారి ఉపగ్రహాల్లోని వ్యవస్థల్లో తలెత్తే వైఫల్యాలు లేదా సౌర కార్యకలాపాల వల్ల కూడా అవి పడిపోతాయన్నారు. అయితే ఖగోళంలో ఇలాంటి ఉపగ్రహాలు , రాకెట్ శకలాల సంఖ్య పెరగడం వల్ల అంతరిక్ష వ్యర్థాలు ఎక్కువై , కెస్లర్ సిండ్రోమ్ అనే చైన్ రియాక్షన్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కక్షలో ఉన్న ఇతర ఉపగ్రహాలు ఢీకొనే అవకాశం ఉంటుందని , ఖగోళ వ్యర్థాల చైన్ రియాక్షన్, సౌర కార్యకలాపాలపై ప్రభావం ఉంటుందన్నారు. మరోవైపు స్టార్‌లింక్ తరచూ కక్ష లోకి ఉపగ్రహాలను ప్రవేశ పెట్టడం వల్ల అంతరిక్ష ట్రాఫిక్ ఏర్పడి, మానవాళికి పెద్ద సవాల్‌గా మారుతుందన్నారు. రాబోయే పదేళ్లలోమస్క్ సంస్థ మరో పదివేల ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం ఉందని అంచనా వేశారు.

కెస్లర్ సిండ్రోమ్ అంటే ?

కెస్లర్ సిండ్రోమ్ అనేది ఖగోళ వ్యర్థాలకు సంబంధించిన చైన్ రియాక్షన్ . ఇక్కడ భూ కక్షలో శిథిలాల సంఖ్య పెరిగినప్పుడు ,అవి ఒకదానికొకటి ఢీకొని మరిన్ని శిథిలాలను సృష్టిస్తాయి. దీనివల్ల ఉపగ్రహాలకు , భవిష్యత్ అంతరిక్షపరిశోధనలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది.

Leave a Comment