పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై భార్య ఫ‌స్ట్ రియాక్ష‌న్‌..!

Written by RAJU

Published on:

పాస్టర్‌ ప్రవీణ్‌ కుమార్ పగడాల అనుమానాస్పద మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత నెల 24న హైదరాబాద్ లో బయలుదేరిన ప్రవీణ్ కుమార్.. తెలంగాణ దాటి ఏపీలోకి ప్రవేశించిన తర్వాత విజయవాడ మీద రాజమహేంద్రవరం వెళుతుండగా మృతి చెందారు. మొద‌ట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అదే సమయంలో ప్రవీణ్ మృతిపై పలువురు నుంచి తీవ్ర అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ను హ‌త్య చేశారంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్ట‌డంతో ఈ ఘటనకు రాజకీయ రంగులు పులిమే పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ నేప‌థ్యంలోనే తాజాగా పాస్టర్‌ ప్రవీణ్ కుమార్ మృతిపై ఆయ‌న భార్య జెస్సికా ప‌గ‌డాల ఫ‌స్ట్ టైమ్ రియాక్ట్ అయ్యారు. తన భర్త మరణాన్ని ద‌య‌చేసి రాజకీయం చేయవద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌వ‌కు బుధ‌వారం ఒక వీడియోను విడుద‌ల చేశారు.

ప్రవీణ్ మరణాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వాడుకుంటున్నారు. యేసు మార్గాన్ని అనుసరించే వారు మతద్వేషాలు రెచ్చగొట్టరు. ప్రవీణ్ ఎప్పుడు మతసామరస్యాన్ని కోరుకునేవారని ఈ సంద‌ర్భంగా జెస్సికా తెలిపారు. ప్రవీణ్ మృతిని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూడడం నిజంగా దారుణమ‌న్నారు. త‌న భర్త మరణంపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉంద‌ని.. నిష్ప‌క్షపాతంగా పోలీసుల విచారణ చేస్తున్నార‌ని జెస్సికా పేర్కొన్నారు. పోలీసుల విచారణకు అందరూ సహకరించాల‌ని కోరారు.

అలాగే ప్రవీణ్ మృతి తర్వాత త‌న‌కు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవ సోదర, సోదరీమణులు మద్దతుగా నిలుస్తున్నార‌ని.. వారందరికీ ధన్యవాదాల‌ని జెస్సికా వీడియోలో తెలిపారు. కాగా, ప్రవీణ్ మృతి కేసును సీరియస్ గా తీసుకున్న ఏపీ స‌ర్కార్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టింది. ప్రవీణ్ కేసుకు సంబంధించి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు సుమారు రెండు వందల సీసీ కెమెరాల‌ నుంచి సేకరించిన 13 గంటల ఫుటేజీ మ‌రియు పోస్టుమార్టం రిపోర్టును తూర్పుగోదావ‌రి జిల్లా పోలీసులు ప‌రిశీలించారు. ద‌ర్యాప్తు ఆల్మోస్ట్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. నేడో, రేపో మీడియాకు జిల్లా పోలీసులు ప్ర‌వీణ్ మృతికి సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి.

Subscribe for notification
Verified by MonsterInsights