– అంతిమయాత్రలో అడుగడుగున జననీరాజనం..
– మూగబోయిన ఉద్యమాల పురిటిగడ్డ
– రేణుక మృతదేహానికి నివాళులు అర్పించిన
– ప్రజా సంఘాలు, అభిమానులు, మేధావులు, మాజీ మావోయిస్టులు
నవతెలంగాణ-దేవరుప్పుల
చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు స్పెషల్ జోన్ కమిటీ రాష్ట్ర నాయకులు గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను అలియాస్ చైతు అలియాస్ సరస్వతికి జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం అర్ధ రాత్రి కడవెండి గ్రామానికి చేరుకున్న రేణుక మృతదేహాన్ని చూసి కడవెండి గ్రామ ప్రజలంతా కన్నీటితో స్వాగతం పలుకుతూనే తన జీవిత ప్రస్థానాన్ని నెమరు వేసుకున్నారు. బుధవారం రేణుక మృతదేహానికి విప్లవ సంఘాల నాయకులు, నాయకులు, అభిమానులు, విప్లవ రచయితల సంఘం నాయ కులు, మాజీ మావోయిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. అంతిమ యాత్రలో దేవరపుల మండలంలోని పలు గ్రామాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించా రు. రేణుక అంతిమయాత్రలో అడుగడుగున జనం నీరాజనం పలుకుతూ.. పాలకవర్గాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేణుక స్ఫూర్తిని కొనసాగిస్తా మని ప్రతినబూనారు. అంతిమయాత్రలో ఐదు వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాళులు
కడవెండి గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేణుక ఉన్నత చదువులు చదివినా.. నేడు విగతజీవిగా చూడటం బాధాకరమన్నారు. పదేండ్లలో ఏ ఒక్క ఎన్‌కౌంటర్ జరగలేదని, పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నిలువరించాలని కోరారు. కాగా, అక్కడే ఉన్న విప్లవ, ఉద్యమకారులు.. పాలకులు ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. వర్గాలకు ఇక్కడ స్థానం లేదని, వెంటనే వెళ్లి పోవాలని కోరారు.
రేణుక చితికి నిప్పట్టించిన కుటుంబ సభ్యులు..
కడవండి శ్మశాన వాటికలో రేణుక చితికి తల్లిదండ్రులు గుమ్మడవెల్లి సోమయ్య జయమ్మ, తోడబుట్టిన అన్నలు గుమ్మడవెల్లి వెంకట కిషన్ ప్రసాద్ అలియాస్ ఉసేండి, రాజశేఖర్‌తో పాటు కుటుంబ సభ్యులు నిప్పు అంటించి తుది వీడ్కోలు పలికారు. రేణుక అంతిమయాత్రలో బంధు మిత్రుల సంఘం అధ్యక్షురాలు పద్మ కుమారి, పౌర హక్కుల సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, నారాయణరావు, వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్, శాంతక్క, విరసం నాయకులు పాణి, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనురాధ, కళ, మొగిలిచర్ల భారతక్క, గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, గద్దర్ కొడుకు సూర్యం, వరవరరావు కూతుర్లు అనల, సహజ, పవన, ఉస్మానియా విద్యార్థి నాయకులు పృథ్వి, స్టాలిన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు సుదర్శన్, ఇప్ప రాంరెడ్డి, మా భూమి సంధ్య, వేముల పుష్ప, అరుణోదయ సాంస్కతిక సమాఖ్య, ప్రజా కళామండలి కళాకారులు జర్నలిస్టు నాయకులు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, తెలంగాణ ఉద్యమకారుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.