Forest Land Encroachment: ఏపీలో 133 చదరపు కిలోమీటర్ల అటవీ భూముల కబ్జా

Written by RAJU

Published on:

12వ స్థానంలో నిలిచిన రాష్ట్రం

దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో 13 వేల చదరపు కి.మీ. కబ్జా

ఢిల్లీ, సిక్కిం, గోవా రాష్ట్రాల విస్తీర్ణం కన్నా ఇది ఎక్కువ

వివరాలివ్వని రాష్ట్రాల్లో తెలంగాణ.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1: దేశవ్యాప్తంగా అటవీ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 13 వేల చదరపు కిలో మీటర్ల అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపింది. ఇది.. ఢిల్లీ, సిక్కిం, గోవాల భౌగోళిక విస్తీర్ణంకన్నా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఏపీలో 133 చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూముల ఆక్రమణ జరిగిందని, ఇది దేశవ్యాప్తంగా జరిగిన ఆక్రమణలలో 12వ రాష్ట్రంగా నిలిచిందని తెలిపింది. అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించి 25 రాష్ట్రాలు, కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే వివరాలు వెల్లడించాయని, మరో పది రాష్ట్రాలు వివరాలు సమర్పించలేదని పేర్కొంది. అటవీ భూముల ఆక్రమణలపై వచ్చిన వార్తలను గత ఏడాది జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో సుమోటోగా విచారణకు ఆదేశించింది. కాగా, గత ఏడాది కేంద్రం ఇచ్చిన నివేదిక ప్రకారం.. 7,50,648 హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణలకు గురైంది. ఇది ఢిల్లీ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణానికి ఐదు రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ తమ అటవీ విస్తీర్ణాల ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో గత వారం కేంద్ర పర్యావరణ శాఖ గత ఏడాది మార్చి వరకు 25 రాష్ట్రాలు, కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన అటవీ ప్రాంతాల కు సంబంధించిన నివేదికను ఎన్జీటీకి అందించింది. దీని ప్రకారం 13,056 చదరపు కిలో మీటర్ల అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైనట్టు వివరించింది. ఆయా రాష్ట్రాల్లో ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్‌, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్‌, యూపీ, సిక్కిం, మధ్యప్రదేశ్‌ వంటివి ఉన్నాయి. ఇక, ఇప్పటికీ సమాచారం ఇవ్వని రాష్ట్రాల్లో తెలంగాణ, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ వంటివి ఉన్నాయని నివేదికలో పేర్కొంది.

నివేదికలోని కీలక అంశాలు

మధ్యప్రదేశ్‌లో భారీ ఎత్తున అటవీ భూముల ఆక్రమణలు జరిగాయి. ఏకంగా 5,460.9 చదరపు కిలోమీటర్ల మేర భూములు ఆక్రమణకు గురయ్యాయి.

ఈశాన్య రాష్ట్రం అసోం తర్వాత స్థానంలో నిలిచింది. ఇక్కడ 3,620.9 చదరపు కిలోమీటర్ల మేరకు అటవీ భూములను ఆక్రమించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 133.18 చదరపు కిలో మీటర్ల అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి.

మొత్తం ఆక్రమిత అటవీ భూముల్లో 409.77 చదరపు కిలో మీటర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..

ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..

జీవితాంతం సమాజం కోసమే

For More AP News and Telugu News

Updated Date – Apr 02 , 2025 | 03:29 AM

Subscribe for notification
Verified by MonsterInsights