– సన్నబియ్యం పంపిణీపై సీఎస్ శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రేషన్ బియ్యం నాణ్యత, పరిమాణానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. మంగళవారం ఆమె కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించేందుకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలనీ, అందుకు తగిన విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. ఇప్పటికే యాభై శాతానికి పైగా సన్నబియ్యం చౌక ధరల (రేషన్ షాప్) దుకాణాలకు వచ్చాయనీ, మిగిలిన స్టాక్‌ను రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు.