వేసవి కాలం మొదలైంది. ఫిబ్రవరి నెల చివర నుంచే భానుడు తన ప్రతాపం చూపించడం మొదలు పెడుతున్నాడు. మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక వేసవిలో ఎక్కువగా దాహం వేస్తుంటుంది. ఎన్ని నీళ్లు తాగినా.. దాహం తీరినట్లు అనిపించదు. పైగా శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. ఇలాంటి సమ్యలకు చెక్ పెట్టడం కోసం వేసవిలో చాలా మంది జ్యూసులకు పెద్ద పీట వేస్తారు. ప్రతి రోజు ఏదో ఒక జ్యూసు తాగుతుంటారు. అయితే ఇలా నిత్యం పండ్ల రసాలు సేవించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట. వేసవిలో జ్యూసుల స్థానంలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు..
జ్యూసులు తాగడం కన్నా పండ్లను నేరుగా తినడమే ఆరోగ్యానికి మంచిది అంటారు నిపుణులు. అందుకు కారణం జ్యూసులు రుచిగా ఉండటం కోసం వాటిల్లో చక్కెర కలుపుతాము. అయితే నిత్యం ఇలా చక్కెర తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరి ఏం చేయాలంటే.. జ్యూసులకు బదులుగా కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ, నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ వంటి పండ్లను తినడం మంచిది అంటున్నారు నిపుణులు.
కొబ్బరి నీళ్లు..
వేసవిలో జ్యూస్‌ల బదులు కొబ్బరి నీరు తాగడం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి కొబ్బరి నీరు చాలా మంచి ఎంపికంటున్నారు. దీనిలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సహజంగా ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్‌ను నివారిస్తాయి అంటున్నారు నిపుణులు.
పుచ్చకాయ..
సీజన్‌లతో సంబధం లేకుండా అన్ని కాలాల్లో లభిస్తుంది. ఇక దీనిలో సుమారు దాదాపు 92 శాతం నీరే ఉంటుంది. అందుకే వేసవిలో చల్లదనం, హైడ్రేషన్ కోసం పుచ్చకాయ తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. అంతేకాక ఇందులో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.
మజ్జిగ..
భారతీయ సాంప్రదాయక ఆహారంలో మజ్జిగ తప్పనిసరిగా ఉంటుంది. మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాక దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మజ్జిగకి ఉప్పు, జీలకర్ర కలిపి తాగితే.. వేడి తగ్గుతుంది, జీర్ణక్రియ పెరుగుతుంది.
నిమ్మరసం (తక్కువ చక్కెరతో)..
ఈ వేసివిలో ప్యాకేజ్డ్ జ్యూస్‌లు కొనడం కంటే ఇంట్లోనే తక్కువ చక్కెరలతో జ్యూస్ తయారు చేసుకోవడం చాలా మంచిది. ఆ కోవకు చెందినదే నిమ్మరసం. ఇంట్లోనే తక్కువ చక్కెరతో నిమ్మరసం చేసుకుని తాగితే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు అంటున్నారు నిపుణులు. దీనిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు.
తాజా పండ్లు..
జ్యూస్ తాగడం కన్నా.. పండ్లను నేరుగా అలానే తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం అంటున్నారు నిపుణులు. పండ్లను నేరుగా తినడం వల్ల పోషకాలు అధికంగా లభించడమే కాక.. అవి శరీరానికి ఫైబర్‌ను అందిస్తాయి. అలా కాకుండా పండ్లను జ్యూస్ చేసుకుని తాగితే.. వాటిల్లో ఉండే ఫైబర్ పూర్తిగా తొలగించబడుతుంది. పైగా జ్యూస్‌లో చక్కెర వేస్తాం. అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. చక్కెర ఎక్కువ ఉన్న పదార్థాలు తింటే అవి శరారినికి తక్షణ శక్తినిస్తాయేమో కానీ.. దీర్ఘకాలంలో మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి అంటున్నారు నిపుణులు. కనుక జ్యూస్‌లు మితంగా తీసుకుని.. కొబ్బరి నీరు, మజ్జగ, తాజా పండ్లు తింటూ ఈ వేసవిలో మీ బాడీని కూల్ చేసుకొండి.
ఇవి కూడా చదవండి:
సినిమాలు చూసి మారిపోయినట్లున్నాయ్.. ఈ మేక, పక్షి కలిసి ఏం చేస్తున్నాయో చూడండి.
సన్నబియ్యం వచ్చేశాయ్.. వచ్చే నెల నుంచే రేషన్‌షాపుల్లో పంపిణీ