ఢిల్లీలో బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఇద్దరి మధ్య కుదిరిన పలు కీలక ఒప్పందాలు..!

Written by RAJU

Published on:

దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బిల్‌గేట్స్‌తో చంద్రబాబు చర్చించారు. 40 నిమిషాల పాటు వీళ్లిద్దరి మధ్య భేటీ జరిగింది. ఈ భేటీలో పలు ఒప్పందాలు కూడా జరిగినట్లు సమాచారం.

ప్రముఖ వ్యాపార దిగ్గజం, బిలియనీర్ బిల్‌గేట్స్‌తో కలిసిన విషయాన్ని ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్ట్ చేశారు. బిల్ గేట్స్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపామన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించామంటూ చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

స్వర్ణాంధ్ర 2047 విజన్‌ సాకారానికి కట్టుబడి ఉన్నామని, స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడంలో బిల్‌గేట్స్‌ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలకం కాబోతుందన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. 1995 నుంచి బిల్‌గేట్స్‌తో మంచి సంబంధాలున్నాయి. ఏపీ అభివృద్ధికి బిల్‌గేట్స్ సహకారం అందించడం సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేశారు. ఏపీకి రావాల్సిందిగా బిల్‌గేట్స్‌ను సీఎం చంద్రబాబు కోరారు. అమరావతి, తిరుపతిలో పర్యటించాలని కోరారు.

వీడియో చూడండి.. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification