TG Polycet 2025 Notification: నేడే పాలిసెట్‌ నోటిఫికేషన్‌.. ఈసారి సీట్లన్నీ మనకే! – Telugu News | Telangana Polycet 2025 Notification to be released today, check exam date here

Written by RAJU

Published on:

హైదరాబాద్‌, మార్చి 19:తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన నోటిపికేషన్‌ బుధవారం (మార్చి 19) వెలువడనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మొత్తం పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సీట్లు మొత్తం మన రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో 15 శాతం ఆంధ్రప్రదేశ్‌ విద్యార్ధులకు సీట్లు కేటాయించేవారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావడంతో ఏపీ కోటా సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టింది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా జీవో జారీ చేశారు.

దీంతో రాష్ట్రంలోని మొత్తం సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణ రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను గతంలో తెలంగాణలో పదేళ్లు నివాసమున్నవారు, రాష్ట్రంలోని కేంద్రప్రభుత్వ, పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలు, స్పౌజ్‌గా రాష్ర్టానికి వచ్చిన వారి పిల్లలకు కేటాయించనున్నారు. ఈ మేరకు మొత్తం సీట్లు మన రాష్ట్రం విద్యార్ధులకే లభించనున్నాయి.

కాగా ఇప్పటికే డిప్లొమా, పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ పాలిసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదలవగా.. ఈరోజు పాలీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఇక పాలీసెట్ పరీక్ష మే 13న నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ కూడా ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 19 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేస్తారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 15న నోటిఫికేషన్‌ విడుదల కావల్సి ఉంది. కొన్ని కారణాల రిత్య ప్రకటన ఆలస్యం కావడంతో సాంకేతిక విద్యాశాఖ వర్గాలు బుధవారం నోటిఫికేషన్‌ను విడుదలకు ముహుర్తం ఖరారు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification