గతేడాది కంటే 3.88 లక్షల మంది తక్కువ
1, 2 తరగతులపై విలీనం దెబ్బ
4,200 పాఠశాలల్లో రెండే తరగతులు
6వ తరగతిలోనూ 74వేల మంది ప్రైవేటుకు
టోఫెల్, బైజూస్ హడావుడి వృథా ప్రయాసేనా?
ప్రకాశం జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేవారు. 2022-23 విద్యా సంవత్సరంలో 3, 4, 5 తరగతులను విలీనం పేరుతో మరో పాఠశాలకు తరలించారు. రెండో తరగతి పూర్తయినవారూ ఈ ఏడాది వేరే బడికి వెళ్లిపోయారు. ఒకటో తరగతి పూర్తయిన 13 మంది ప్రస్తుతం రెండో తరగతిలోకి వచ్చారు. ఈ ఏడాది ఒకటో తరగతిలో ఏడుగురే చేరారు. ప్రస్తుతం ఈ స్కూల్‌లో మొత్తం విద్యార్థుల సంఖ్య 20 మాత్రమే.
శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు ప్రాథమిక పాఠశాలలో గతేడాది 32 మంది విద్యార్థులుంటే, ఈ ఏడాది ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. అదే జిల్లా గార మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 23 మంది విద్యార్థులుంటే, ఇప్పుడు ఆ సంఖ్య 21కి తగ్గింది. సరుబుజ్జిలి మండలంలోని ఓ బడిలో గతేడాది ఆరుగురు విద్యార్థులుంటే, ఇప్పుడు ఇద్దరే మిగిలారు. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న పాఠశాలల విలీన నిర్ణయం ఫలితమిది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): కొత్తగా పిల్లల్ని బడుల్లో చేర్పించే తల్లిదండ్రులు తమ బిడ్డ కనీసం ఐదేళ్లు అక్కడే చదవాలని కోరుకుంటారు. కానీ, విలీనం జరిగిన 4,200 పాఠశాలల్లో రెండే తరగతులున్నాయి. వాటిలో చేర్పించినా రెండేళ్ల తర్వాత బడి మార్చాలి. కొత్త బడిని వెతుక్కోవాలి. అదంతా ఎందుకులే అని ఇప్పుడే సమీపంలోని ప్రైవేటు బడిలో చేర్పిస్తున్నారు. దీంతో 1, 2 తరగతులు మాత్రమే మిగిలిన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. దాని పర్యవసానమే ఈ ఏడాది ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తొమ్మిది వేలకు పెరిగింది. అంటే తొమ్మిది వేల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 దాటలేదు. 2022 సెప్టెంబరు నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో 41,38,322 మంది విద్యార్థులున్నారు. అదే విద్యా సంవత్సరంలో 2023 ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 39,95,922కి తగ్గింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రస్తుతం 37,50,293 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అంటే, గతేడాది తొలుత బడుల్లో చేరిన వారితో పోలిస్తే 3,88,029 మంది తగ్గారు. వారంతా ప్రైవేటు స్కూళ్లకు తరలిపోయినట్లు తెలుస్తోంది. గతేడాది ప్రభుత్వ బడుల్లో 7,82,954 మంది ఐదో తరగతి చదవగా, వారిలో 7,09,130 మంది మాత్రమే ఆరో తరగతికి వచ్చారు. అంటే, 73,824 మంది ఆరో తరగతి ప్రభుత్వ బడుల్లో చదవటానికి ఇష్టపడలేదు. అలాగే, గతేడాది 7,28,046 మంది ఎనిమిదో తరగతి చదవగా, వారిలో 7,03,130 మంది మాత్రమే ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. మిగిలిన 25వేల మంది ప్రైవేటు బడులకు తరలిపోయారు. ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతిలో 4,65,684 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. రెండో తరగతిలో 5,99,960 మంది ఉన్నారు. కొత్తగా ఒకటిలో చేరే విద్యార్థుల సంఖ్య దాదాపు 6లక్షలకుపైగా ఉండాల్సినది 5 లక్షల మార్కుకు కూడా చాలా దూరంలో ఉంది. ఇప్పటికే బడులు తెరిచి దాదాపు నెల రోజులు కావడంతో అడ్మిషన్లు చాలావరకు పూర్తయ్యాయి. ఇక అడ్మిషన్లు పెరిగే అవకాశం తక్కువే.
ప్రైవేటులో పెరిగిన విద్యార్థులు
ప్రభుత్వ స్కూళ్లలో తరగతుల విలీనం ప్రక్రియ ప్రైవేటు బడులకు కలిసొచ్చింది. గతేడాది ప్రైవేటు పాఠశాలల్లో 29.1 లక్షల మంది విద్యార్థులుండగా, ఈ ఏడాది ఆ సంఖ్య దాదాపు 35 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. 3, 4, 5 తరగతులను విలీనం చేసిన 4,200 పాఠశాలలకు సమీపంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థుల్లేని 9వేల పాఠశాలల్లో రెండు తరగతులకు పాఠాలు, బోధనేతర పనులు, పుస్తకాలు తెచ్చుకోవడం లాంటి అన్ని పనులూ ఒక్క టీచరే చేయాలి. దీంతో ఆ టీచర్ పాఠాలు చెప్పే సమయం చాలా కుచించుకుపోయింది. ఒక్క టీచర్ ఉన్న బడిలో పిల్లల్ని చేర్పిస్తే అక్కడ బడి వాతావరణమే ఉండదని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. బదులుగా పిల్లలు, టీచర్లు ఎక్కువగా ఉండే ప్రైవేటు బడులకు మొగ్గు చూపుతున్నారు.
పథకాలు చూస్తే..
ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, అమలుచేస్తున్న పథకాల గురించి ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలు వింటే విద్యార్థులు ఇప్పటికిప్పుడు ప్రైవేటు బడులు మానేసి ప్రభుత్వ బడుల్లో చేరతారేమో అనిపిస్తుంది. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అమ్మఒడి పథకం అన్ని పాఠశాలలకు వర్తిస్తుంది. నాడు-నేడు, విద్యాకానుక, ట్యాబ్‌లు, ఈ-కంటెంట్ అన్నీ ప్రభుత్వ బడుల్లో అమలుచేస్తున్నట్లు సీఎం చెబుతున్నారు. నాడు- నేడు రెండు విడతల్లో దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. విద్యా కానుకకు ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసింది. దాదాపు రూ.500 కోట్లతో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఇక ఎప్పటిలాగే గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజనం అమలుచేస్తూ, అందులో రాగిజావ, చిక్కీలు అంటూ హడావుడి చేస్తోంది. వీటికి అదనంగా డిజిటల్ తరగతులు, బైజూస్ కంటెంట్, టోఫెల్ పరీక్షలు అంటూ ప్రచారం మొదలుపెట్టింది. అయినా, విద్యార్థులు ప్రభుత్వ బడులను వీడి వెళ్లిపోతున్నారంటే పథకాల అమలు వట్టి మాటలేనా? లేక ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Updated Date – 2023-07-10T11:50:24+05:30 IST