Farmers: పోడుకు ప్రాణ జలం

Written by RAJU

Published on:

  • రూ.12,600 కోట్లతో గిరిజనులకు సాగునీరు

  • పోడు భూములకు ‘ఇందిర గిరి జల వికాసం’

  • 6 లక్షల ఎకరాల్లో బోర్లు.. సోలార్‌ పంపు సెట్లు

  • రాష్ట్రంలో నాలుగేళ్లలో దశలవారీగా పథకం

  • కేంద్ర పథకాల నిధులూ వాడుకోనున్న సర్కారు

హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): గిరిజన రైతుల పోడు సాగుకు చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టాలిచ్చిన పోడు భూముల్లో సేద్యానికి అవసరమైన సాగు నీటిని అందించేందుకు ‘ఇందిర గిరి జల వికాసం’ పేరిట కొత్త పథకాన్ని అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ పథకాన్ని బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొత్త పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) రూ.600 కోట్లు.. వచ్చే నాలుగేళ్లలో ఏడాదికి రూ.3000 కోట్ల చొప్పున రూ.12,600 కోట్లను ఖర్చు చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ నిధులతో పట్టా పోడు భూముల్లో బోర్లు వేయించి, సోలార్‌ పంపు సెట్లను అందించనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం-కుసుమ్‌ పథకం కింద వచ్చే నిధులను కూడా వినియోగించుకోనున్నారు. దీంతోపాటు గిరిజనుల కోసం కేంద్రం ప్రారంభించిన ధాత్రి అభియాన్‌ జన్‌జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ (డీఏ-జేజీయూఏ) పథకం కింద కూడా నిధులు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందిర గిరి జల వికాసం పథకానికి నీటి పారుదల, విద్యుత్తు, రెడ్కో, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఐటీడీఏల ద్వారా నిధులను కేటాయించి వినియోగించనుంది. గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధుల్లో ఖర్చు చేయని వాటినీ ఈ పథకం అమలుకు వాడుకోనుంది. ఉద్యానవన, అటవీ శాఖలతోనూ సమన్వయం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

6 లక్షల ఎకరాలు.. 2 లక్షల మందికి లబ్ధి..

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,30,735 మంది పోడు రైతుల పరిధిలోని 6.68 లక్షల ఎకరాలకు పట్టాలున్నాయి. వీటిలో 23,886 మంది రైతులకు చెందిన 69,039 ఎకరాలకు గిరిజన శాఖ ఇప్పటికే రూ.141.57 కోట్లతో సాగునీటి సదుపాయాన్ని కల్పించింది. తర్వాత గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిగిలిన రైతులు ఎవరికీ నీటి సదుపాయం కల్పించలేదు. ఫలితంగా ఆ భూముల్లో వర్షం పడితేనే పంటలు పండే పరిస్థితి నెలకొంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన పోడు భూముల్లో బోర్లు వేయించి, నీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. గిరిజన శాఖ నుంచి నివేదిక తెప్పించగా.. 2,10,000 మంది రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు నీటి సదుపాయం కల్పించాల్సి ఉందని తేలింది. వీరందరికీ దశల వారీగా కొత్త పథకం కింద నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సోలార్‌ పంపు సెట్లను అధికంగా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని సర్కారు యోచిస్తోంది. రాష్ట్రంలోని పోడు భూముల్లో చాలా వరకు నల్లరేగడి నేలలే ఉన్నాయి. వర్షపు నీటితో మాత్రమే ప్రస్తుతం పంటలు సాగవుతున్నాయి. గిరిజనులు పెద్దగా ఎరువులు కూడా వినియోగించరు. అలాంటి సారవంతమైన భూముల్లో సంప్రదాయ పంటలు కాకుండా.. లాభసాటిగా ఉండే పంటలనే సాగు చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. వ్యవసాయ శాఖ ఆయిల్‌పామ్‌తో పాటు ఇతర వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తోంది. గిరిజనులకు కూడా ఆయా పంటలపై అవగాహన కల్పించి, సాగు చేయిస్తే లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నట్లు తెలిసింది.

పథకం కింద ఏం అందిస్తారంటే..

  • గ్రామీణ ఉపాధి పథకం, ఐటీడీఏ, డీఆర్‌డీఏ కింద భూములను సాగుకు అనుకూలంగా అభివృద్ధి చేస్తారు.

  • 150/200 అడుగుల లోతులో లేదా భూగర్భ జలాల పరిస్థితిని బట్టి ఆ భూముల్లో బోర్లు వేయిస్తారు.

  • 5 హెచ్‌పీ లేదా 7.5 హెచ్‌పీ సామర్ధ్యంతో నడిచే సోలార్‌ పంపు సెట్లను అందిస్తారు.

  • ఒక హెక్టారు ఉన్న రైతులకు నేరుగా బోర్లు వేయించి, పంపు సెట్లు అందిస్తారు. అంతకంటే తక్కువ ఉన్న రైతులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఈ సదుపాయాలను కల్పించి ఉమ్మడి సాగు చేయిస్తారు.

నిధుల కేటాయింపు.. ఖర్చు ఇలా.. (అంచనా)

సంవత్సరం బడ్జెట్‌ లబ్ధి చేకూరనున్న

రైతులు

2024-25 600 10,000

2025-26 3,000 50,000

2026-27 3,000 50,000

2027-28 3,000 50,000

2028-29 3,000 50,000

మొత్తం 12,600 2,10,000

Subscribe for notification