గ‌వ‌ర్న‌ర్‌కు సునీత ఫిర్యాదు..ఇంకెన్నాళ్లు?

Written by RAJU

Published on:

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ బాబాయి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య వ్య‌వహారం తాజాగా గ‌వ‌ర్న‌ర్ పేషీకి చేరింది. మార్చి 15తో వివేకా హ‌త్య జ‌రిగి 6 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కుమార్తె, ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్న మ‌ర్రెడ్డి సునీత‌.. తాజాగా గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌ను క‌లిశారు. శ‌నివారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో ఆమె ప్ర‌త్యేక అప్పాయింట్‌మెంటు తీసుకుని.. గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయ్యారు. వాస్త‌వానికి గ‌వ‌ర్న‌ర్‌.. వేరే కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల్సి ఉంది. అయిన‌ప్ప‌టికీ.. సునీత కోసం ఆయ‌న 20 నిమిషాలు స్పెండ్ చేశార‌ని గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌య వ‌ర్గాలు తెలిపాయి.

నాకు తెలుసు: గ‌వ‌ర్న‌ర్‌

సునీత గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన సంద‌ర్భంలో ఆమె ఒక్క‌రే ఉన్న‌ట్టు తెలిసింది. త‌న తండ్రి మ‌ర‌ణానికి సంబంధించిన ఫొటోల ఆల్బ‌మ్ ను తీసుకువెళ్లి… ఆయ‌న‌కు చూపించారు. అదేవిధంగా కోర్టుల్లో జ‌రుగుతున్న విచార‌ణ‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు(వైసీపీ+కూట‌మి) వ్య‌వహ‌రిస్తున్న తీరును కూడా ఆమె వివ‌రించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకుని.. త‌న‌కు అన్ని విష‌యాలు తెలుసున‌ని.. అప్ప‌ట్లో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్నాన‌ని.. జాతీయ మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాలు కూడా చ‌దివాన‌ని పేర్కొన్న‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిద్దామ‌ని వ్యాఖ్యానించారు.

అయితే.. సునీత మాత్రం.. కూట‌మి స‌ర్కారు స‌రిగా స్పందించ‌డం లేద‌ని, సాక్షుల‌కు ర‌క్ష‌ణ‌గా నిల‌వాల్సిన వారే.. ఎందుకో త‌ప్పు కొంటున్నార‌ని ఫిర్యాదు చేసిన‌ట్టు ప‌క్కా స‌మాచారం. గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం, ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం కూడా.. ఈ కేసులో ఉదాశీనంగా ఉన్నాయ‌ని ఆమె ఆరోపించిన‌ట్టు తెలిసింది. సాక్షులు ఒక్కొక్క‌రుగా మృతి చెందితే.. కేసు నీరిగారిపోతుంద ని.. ఈ విష‌యంలో జోక్యం చేసుకుని కూట‌మి స‌ర్కారుకు స‌రైన దిశానిర్దేశం చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కు ఆమె విన్న‌వించారు. ఆమె చెప్పిన అన్ని విష‌యాల‌ను విన్న గ‌వ‌ర్న‌ర్‌.. దీనిపై ఆలోచిస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. కాగా.. గ‌వ‌ర్న‌ర్ అప్పాయింట్ మెంటు తీసుకునే స‌మాచారాన్ని సునీత అత్యంత ర‌హ‌స్యంగా ఉంచ‌డం గ‌మ‌నార్హం.

Subscribe for notification