ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ తన మైదానంలోని వ్యక్తిత్వంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ మాట్లాడుతూ, తన మైదానంలో ఉన్న తీరును ప్రజలు రెండు విధాలుగా విశ్లేషించారని, ఒకప్పుడు తన అగ్రేషన్ సమస్యగా భావించారని, ఇప్పుడు తన ప్రశాంతతను సమస్యగా చూస్తున్నారని తెలిపారు. మైదానంలో తాను ప్రశాంతంగా ఉన్నప్పటికీ, తన పోటీతత్వం తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా మెల్‌బోర్న్‌లో జరిగిన నాల్గవ టెస్ట్‌లో యువ క్రికెటర్ సామ్ కాన్‌స్టాస్‌ను భుజంతో ఢీ కొట్టడంతో, ప్రేక్షకులతో సంభాషించడం వివాదానికి కారణమయ్యాయి. ఇది 2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా సంచలనం సృష్టించిన ‘సాండ్‌పేపర్ గేట్’ ఘటనను గుర్తుకు తెచ్చేలా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు.
ఈ అంశంపై కోహ్లీ మాట్లాడుతూ, “ఇది సహజంగానే మారుతున్నట్లు అనిపిస్తుంది. గతంలో నా దూకుడు ఒక సమస్య, ఇప్పుడు నా ప్రశాంతత ఒక సమస్యగా మారింది. నాకు ఏమి చేయాలో తెలియడం లేదు. అందుకే నేను దీనిపై పెద్దగా దృష్టి పెట్టను” అని అన్నారు. మైదానంలో తన పోటీ స్వభావం ఎప్పుడూ జట్టును గెలిపించేందుకు ఉపయోగపడేలా ఉండాలని తాను కోరుకుంటానని, వికెట్ పడినప్పుడు చేసే సంబరాలు కూడా ఆ ఉద్దేశ్యంతోనే జరుగుతాయని తెలిపారు.
తన మైదానంలో వ్యక్తిత్వం ఎల్లప్పుడూ సరైన ఉద్దేశ్యంతోనే ఉంటుందని, కానీ దానిని ఎలా అర్థం చేసుకోవాలో కొందరికి క్లారిటీ ఉండదని కోహ్లీ అభిప్రాయపడ్డారు. “నా పోటీతత్వం తగ్గలేదు. కానీ ఇప్పుడు నేను ఎప్పుడూ నిరాశను వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి, నేను మైదానంలో ఎంత శాంతంగా ఉన్నా, నా పోటీ తత్వం మాత్రం అలానే ఉంది” అని అన్నారు.
ఇటీవల కోహ్లీ భారత జట్టుతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో 54.50 సగటుతో 218 పరుగులు చేసిన కోహ్లీ, జట్టులో రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాకిస్తాన్‌పై చేసిన అద్భుతమైన 100* పరుగుల ఇన్నింగ్స్, అలాగే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 98 బంతుల్లో 84 పరుగులు చేయడం, అతని ప్రతిభను మరోసారి రుజువు చేశాయి.
మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025 సీజన్‌ను ప్రారంభించనున్నాడు. మొదటి ఐపీఎల్ టైటిల్ గెలవడమే కాకుండా, మరిన్ని బ్యాటింగ్ రికార్డులను తన ఖాతాలోకి చేర్చుకోవడమే కోహ్లీ లక్ష్యం.
Virat Kohli said – “I don’t know what to do to be honest. My Aggression was a problem and now my calmness is a problem”. pic.twitter.com/Wl5L1NXlAZ
— Virat Kohli Fan Club (@Trend_VKohli) March 15, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..