ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌ను నోరు మెదపకుండా చేసిన భారత్..!

Written by RAJU

Published on:

పాకిస్తాన్‌ను మరోసారి ఐక్యరాజ్యసమితిలో నోరు మెదపకుండా చేసింది భారతదేశం. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే లేవనెత్తడం వల్ల ప్రపంచం ముందు అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ తన కార్యకలాపాలను ఆపాడంలేదు. జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతూనే ఉంది. తాజాగా జమ్మూ కాశ్మీర్, ఇస్లామోఫోబియాపై పాకిస్తాన్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. జమ్మూ కాశ్మీర్‌పై పాకిస్తాన్ వాదనలను ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ శుక్రవారం (మార్చి 14) తీవ్రంగా తప్పుబట్టారు. భారతదేశంలోని ఈ అంతర్భాగం పాకిస్తాన్‌లో భాగం కాబోదని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అని, ప్రస్తుతం ఉందని, ఎల్లప్పుడూ ఉంటుందని పర్వతనేని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సమావేశంలో పర్వతనేని పాకిస్తాన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ఇటీవల చేసిన ప్రకటనపై భారతదేశం ఇచ్చిన ప్రతిస్పందనను చదివి వినిపించారు. “తన సాధారణ అలవాటు లాగే, పాకిస్తాన్ మాజీ విదేశాంగ కార్యదర్శి మరోసారి భారత కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ గురించి అనవసరమైన ప్రస్తావన చేశారన్నారు. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే లేవనెత్తడం ద్వారా, ఈ ప్రాంతంపై వారి వాదన చెల్లదన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం సమర్థనీయం కాదని హరీష్ స్పష్టం చేశారు. ‘పాకిస్తాన్ చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేది, ఉంటుంది. ఎల్లప్పుడూ అలాగే ఉంటుందనే వాస్తవాన్ని మార్చిపోద్దు’ అని ఆయన అన్నారు.

పాకిస్తాన్ తన దేశంలో జరిగిన రైలు హైజాక్‌లో భారతదేశ పాత్ర ఉందని ఆరోపిస్తూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను శుక్రవారం భారతదేశం తోసిపుచ్చింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం తరపున హరీష్ పర్వతనేని ఈ ప్రకటన చేశారు. భారతదేశం ఈ ఆరోపణలను తిరస్కరించింది. ప్రపంచ ఉగ్రవాదానికి నిజమైన కేంద్రం ఎక్కడ ఉందో ప్రపంచానికి బాగా తెలుసునని హరీష్ పేర్కొన్నారు. ‘భారతదేశం వైవిధ్యం, బహుత్వానికి నిలయం. భారతదేశంలో 20 కోట్లకు పైగా ముస్లింలు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభాలో ఒకటి. ముస్లింలపై మతపరమైన అసహనం సంఘటనలను ఖండించడంలో ఐక్యరాజ్యసమితి సభ్యుడిగా భారతదేశం ఐక్యంగా నిలుస్తుంది. మతపరమైన వివక్షత, ద్వేషం, హింస లేని ప్రపంచాన్ని ప్రోత్సహించడం భారతదేశానికి ఎల్లప్పుడూ జీవన విధానంగా ఉందని హరీష్ పర్వతనేని ఐక్యరాజ్యసమితి సమావేశంలో అన్నారు.

1981 డిక్లరేషన్‌లో సరిగ్గా గుర్తించినట్లుగా, ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా పోరాటం అన్ని రకాల మత వివక్షకు వ్యతిరేకంగా విస్తృత పోరాటానికి కేంద్రబిందువు అని మనం గుర్తుంచుకోవాలని పర్వతనేని హరీష్ అన్నారు. మతంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి గౌరవంగా, భద్రతతో, గౌరవంగా జీవించగలిగే భవిష్యత్తు కోసం మనం కృషి చేద్దాం. మనం రాడికల్ మనస్తత్వం మరియు ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా పనిచేయాలని హరీష్ పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification