మెడికల్ పీజీ సీట్లు.. మేం పెంచలేదు
ఎక్కువ సీట్లకు కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారు?
తక్షణమే కౌన్సెలింగ్ మొత్తాన్నీ రద్దు చేయండి
ఆరోగ్య వర్సిటీని ఆదేశించిన ఎన్ఎంసీ
ఎన్ఎంసీ లేఖల ఆధారంగానే సీట్లు పెంచిన కాలేజీలు, వర్సిటీ
అయితే ఆ లేఖలు తాము రాయలేదంటున్న ఎన్ఎంసీ
కౌన్సెలింగ్ రద్దు చేస్తూ వర్సిటీ నోటిఫికేషన్
కొత్తగా సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చేందుకు నిర్ణయం
అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్వహించిన మెడికల్ పీజీ కౌన్సెలింగ్ (Medical PG Counselling) రద్దయ్యింది. ఇప్పటి వరకూ జరిగిన మొదటి విడత కౌన్సెలింగ్‌ను రద్దు చేస్తున్నట్లు హెల్త్ వర్సిటీ (Health University) నోటిఫికేషన్ విడుదల చేసింది. సీటు పొందిన విద్యార్థులు ఎవరూ ఆయా కాలేజీల్లో చేరవద్దని పేర్కొంది. రాష్ట్రంలోని కొన్ని మెడికల్ కాలేజీల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది పీజీ సీట్లు పెరిగాయి. ఆయా కాలేజీల్లో సీట్లు పెంచుతూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నుంచి హెల్త్ వర్సిటీతోపాటు కాలేజీలకు లేఖలు వెళ్లాయి. ఎన్ఎంసీ నుంచి లేఖలు రావడంతో వర్సిటీ అధికారులు కూడా ఆయా కాలేజీల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కాలేజీల్లో సౌకర్యాలు బాగానే ఉన్నాయని నిర్థారించి కౌన్సెలింగ్‌కు సిద్ధమయ్యారు. ఎన్ఎంసీ నుంచి వచ్చిన లేఖల ఆధారంగా సీట్ మ్యాట్రిక్ సిద్ధం చేసి, తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియను వర్సిటీ పూర్తి చేసింది. రెండో విడత కౌన్సెలింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో హెల్త్ వర్సిటీకి ఎన్ఎంసీ షాక్ ఇచ్చింది. ఏపీలోని కొన్ని మెడికల్ కాలేజీలకు తాము అదనపు పీజీ సీట్లు కేటాయించలేదని, తమ పేరుతో ఫేక్ లేఖలు వర్సిటీకి, కాలేజీకి వచ్చాయని చావుకవురు చల్లగా చెప్పింది. దీంతోపాటు ఏపీలో జరుగుతున్న కౌన్సెలింగ్ ప్రక్రియను తాత్కాలిక నిలిపివేయాలని సూచించింది. ఎన్ఎంసీ నుంచి వచ్చిన సూచనల ఆధారంగా వర్సిటీ అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు. పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. అనంతరం వర్సిటీ అధికారులు ఎన్ఎంసీని సంప్రదించగా రాష్ట్రంలోని మూడు మెడికల్ కాలేజీల్లో తాము కేటాయించిన దాని కంటే అదనపు సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించినట్టు తెలిపారు. ఆయా కాలేజీలకు తాము ఎల్వోపీ (లెటర్ ఆఫ్ పర్మిషన్) ఇవ్వలేదని తెలిపింది. దీంతో ఎన్ఎంసీ అనుమతి లేని సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వర్సిటీ అధికారులు గుర్తించారు. విద్యార్థులకు కేటాయించిన సీట్లల్లో చాలా సీట్లకు ఎన్ఎంసీ గుర్తింపు లేదు. కాబట్టి ఇప్పటి వరకూ జరిగిన కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకూ జరిగిన కౌన్సెలింగ్ ప్రక్రియలో మెరిట్ లిస్ట్‌ను మాత్రమం యథావిధిగా కొనసాగిస్తారు. కానీ సీట్ మ్యాట్రిక్స్, సీట్ల కేటాయింపు ప్రక్రియ మళ్లీ కొత్తగా జరుగుతుంది. ఇందుకోసం వర్సిటీ అధికారులు మళ్లీ సీట్ మ్యాట్రిక్స్ సిద్ధం చేయనున్నారు.
జనరల్ మెడిసిన్ సీట్లే ఎక్కువ
ఎన్ఎంసీ నుంచి హెల్త్ వర్సిటీకి, మెడికల్ కాలేజీలకు వచ్చిన ఫేక్ ఎల్వోపీల్లో ఎక్కువ జనరల్ మెడిసిన్ సీట్లున్నాయి. కర్నూలు శాంతిరామ్ మెడికల్ కాలేజీలో ఏడు జనరల్ మెడిసిన్ సీట్లు ఉన్నాయి. వాటిని 24కు పెంచుతూ ఎన్ఎంసీ నుంచి ఎల్వోపీ వచ్చింది. అలానే ఆప్తమాలజీ సీట్లు 5నుంచి 10, ఈఎన్టీ సీట్లు 1 నుంచి 4కు పెంచుతున్నట్లు లేఖ వచ్చింది. రాజమండ్రి జీఎ్సఎల్వీ మెడికల్ కాలేజీలో 14 జనరల్ మెడిసిన్ సీట్లు ఉండగా.. వాటిని 40కు పెంచుతున్నట్లు, విజయనగరం మహరాజా మెడికల్ కాలేజీలో కూడా జనరల్ మెడిసిన్ సీట్లు పెంచినట్లు లేఖలు వచ్చాయి. ఇవన్నీ ఫేక్ ఎన్వోపీలని ఎన్ఎంసీ అంటోం ది. అయితే ఈ ఎల్‌వోపీలు అన్నీ వర్సిటీకి, కాలేజీకి ఎన్ఎంసీ పేరు మీదే వచ్చాయి. వర్సిటీకి వచ్చిన షీల్డ్ కవర్లపై కూడా ఎన్ఎంసీ ముద్ర ఉన్నట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఎన్ఎంసీ పేరుతో పీజీ సీట్లు పెంచుతున్నట్లు షీల్డ్ కవర్ ఎలా వచ్చాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఆందోళనలో విద్యార్థులు
వర్సిటీ కౌన్సెలింగ్ రద్దు చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో పీజీ కౌన్సెలింగ్ ఆఘమేఘాల మీద నడుస్తోంది. మన రాష్ట్రంలో నోటిఫికేషన్, సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేయడంలోనే కొంత ఆలస్యం జరిగింది. ఆలస్యంగా అయినా తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిందని విద్యార్థులు సంతోషపడ్డారు. చాలామంది విద్యార్థులు తమకు కావాల్సిన సీటు ఆప్షన్ పెట్టుకోవడం, సీటు కేటాయింపు ప్రక్రియ కూడా ముగిసింది. ఈ సమయంలో కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం రద్దు చేస్తున్నట్లు వర్సిటీ ప్రకటించడంతో విద్యార్థులు షాక్ అయ్యారు. మళ్లీ నిర్వహించే కౌన్సెలింగ్‌లో నచ్చిన సీటు వస్తుందో.. రాదోనన్న ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు.
Updated Date – 2023-09-01T11:44:21+05:30 IST