భారత్, చైనా సహా పలు దేశాలపై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాదుడుకు సిద్ధమయ్యారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారి కాంగ్రెస్ జాయింట్ సెషన్‌లో ప్రసంగించిన ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండోసారి పదవి చేపట్టిన ఆరు వారాల్లో తాను చేసిన పనులు సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలు దేశాలపై విధిస్తున్న సుంకాలు గురించి ప్రస్తావించారు. భారత్, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని వెల్లడించడం సంచలనంగా మారింది. కొన్ని దేశాలు దశాబ్దాలుగా తమపై టారిఫ్‌లు విధిస్తున్నాయని, ఇప్పుడు తమ టైమ్ వచ్చిందని అన్నారు. ఐరోపా సమాఖ్య, చైనా, బ్రెజిల్, భారత్ లాంటి చాలా దేశాలు తమ నుంచి అధికంగా టారిఫ్‌లు వసూలు చేస్తున్నాయని, అందులోనూ భారత్ 100శాతానికి పైగా ఆటో టారిఫ్‌లు విధించిందని గుర్తు చేశారు. ప్రస్తుత వ్యవస్థలతో అమెరికాకు ఎక్కడా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే ఏప్రిల్ 2 నుంచి ఆయా దేశాలపై తాము కూడా ప్రతీకార సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ఆయా దేశాలు ఎంత టారిఫ్‌లు విధిస్తే, అదే స్థాయిలో తామూ వసూలు చేస్తామని తెలిపారు. ప్రతీకార టారిఫ్‌లతో అమెరికా మరింత సంపన్న దేశంగా, గొప్ప దేశంగా మళ్లీ అవతరిస్తుందన్నారు డొనాల్డ్ ట్రంప్. వాస్తవానికి ఏప్రిల్ ఒకటి నుంచే అమలు చేయాలనుకున్నా, అలా చేస్తే మీమ్స్ బారిన పడాల్సి వస్తుందనే ఆలోచనతోనే ఏప్రిల్ 2 నుంచి వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గత ఆరు వారాల్లో 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశానని, మరో 400 కార్యనిర్వాహక చర్యలు చేపట్టినట్లు ట్రంప్ వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఏప్రిల్ 2 నుంచి అమెరికా విధించబోయే సుంకాలు భారత, చైనా ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.