ఎల్లారెడ్డిపేట, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : ప్రజలను చైతన్యపరిచే రచనలతోనే పాలకుల్లో మార్పు వస్తుందని అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూకంటి జగన్నాథం అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్‌లో 1997-1998 పదో తరగతి పూర్వవిద్యార్థుల ఆధ్వర్యంలో జర్నలిస్టు మంగురపు విష్ణుప్రసాద్ రచించిన ‘తెగమురిసే మేక’ కవితా సంకలనం పుస్తక పరిచయ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జూకంటి జగన్నాథం మాట్లాడుతూ ప్రజలు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. సమాజహితాన్ని కోరేది కవిత్వమని అన్నారు. యువ కవులు, రచయితలు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న స్థితిగతులపై రచనల ద్వారా అస్త్రాలను సాధించాలన్నారు. సిరిసిల్లలో బీసీల జనాభా అధికంగా ఉన్నా ఎమ్మెల్యేలు కాలేకపోవడానికి కారణం చైతన్యం లేకపోవడమేనని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్‌కు నేటికీ సిరిసిల్లలో ఓటు హక్కు లేకపోవడం ఈప్రాంత ప్రజల్లో ఉన్న చైతన్యానికి నిదర్శనమని అన్నారు. వారానికి రెండు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్న ఆయన మర్చిపోయారన్నారు. ప్రజలు మేకల్లా మారినంత కాలం పాలకులు మోసం చేస్తూనే ఉంటారన్నారు. కవి విష్ణుప్రసాద్ జర్నలిస్టుగా రాణిస్తూనే పాలకుల తీరును కవిత్వం ద్వారా ఎండగట్టారన్నారు. అనంతరం విష్ణుప్రసాద్‌ను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్ గోపాల్, ప్యాక్స్ చైర్మన్, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వివేక రచయిత సంఘం ప్రతినిధి పర్శరాములు, పూర్వ విద్యార్థులు కిషన్, ఆంజనేయులు, స్వామి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.