MLC Elections: ఐదుగురు ఎమ్మెల్సీలూ ఏకగ్రీవం!

Written by RAJU

Published on:

  • కాంగ్రెస్‌, సీపీఐ, బీఆర్‌ఎస్‌ సభ్యులకు ధ్రువీకరణ పత్రాలిచ్చిన ఎన్నికల అధికారి

  • విజయశాంతి ఆస్తి రూ.113 కోట్లు

  • సొంతిల్లు, కారు లేదన్న రాములమ్మ

  • అద్దంకి దయాకర్‌కు వాహనాల్లేవ్‌

  • దాసోజు శ్రవణ్‌కు సొంతిల్లు లేదు

  • తెలంగాణ కేసీఆర్‌ సొత్తు కాదు: విజయశాంతి

  • ఏపీలోనూ ఐదుగురు ఎమ్మెల్సీలు ఎకగ్రీవం

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు సభ్యులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్‌; సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం; బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. గడువు అనంతరం ఐదు స్థానాలకు ఐదుగురి నామినేషన్లే మిగలడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డి ప్రకటించారు. వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు, పొంగులేటి, కోమటిరెడ్డి, జూపల్లి, ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. దాసోజు శ్రవణ్‌ ధ్రువీకరణ పత్రం తీసుకునే సమయానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు నిరసన తెలిపేందుకు వెళ్లారు. దీంతో బీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయ కార్యదర్శి, ఇతరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఏకగ్రీవంగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్సీలు తమ ఆస్తులు, కేసుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు.

అద్దంకి ఆస్తి 1.03 కోట్లు

అద్దంకి దయాకర్‌ పేరిట వాహనాలేమీ లేవు. భార్య పేరుతో ఒక స్కూటర్‌ మాత్రం ఉంది. ఆయన ఆస్తి 1.03 కోట్లు, అప్పు రూ.53.44 లక్షలుగా పేర్కొన్నారు. ఆయన చరాస్తి రూ.1,01,774; భార్యకు రూ.20 లక్షల విలువ చేసే బంగారం, వెండి, నగదుతో కలిపి రూ.35.58 లక్షలు ఉన్నట్లు తెలిపారు. జనగామలో రూ.6 లక్షల విలువైన స్థలం, హఫీజ్‌పేటలో 2,275 చ.అ. విస్తీర్ణం ఉన్న రూ.60.74 లక్షల విలువైన ఫ్లాట్‌ ఉన్నాయి.

నెల్లికంటి సత్యంపై పలు కేసులు

నెల్లికంటి సత్యం పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. కిడ్నాప్‌, ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించడంతోపాటు పలు కేసులున్నాయి. ఆయన భార్య చరాస్తులు రూ.25.90 లక్షలు. స్థిరాస్తులు రూ.48.50 లక్షలు. ఇందులో నల్లగొండలో ఇల్లు, ఆ జిల్లాలో సుమారు 10 ఎకరాల భూమి ఉన్నాయి. భార్యాభర్తల పేరిట చెరో రెండు లక్షల పంట రుణం ఉంది.

శ్రవణ్‌కు సొంతిల్లు లేదు

దాసోజు శ్రవణ్‌ కుమార్‌ తనకు ఇల్లు, ప్లాట్లు, ఫ్లాట్లు లేవని ప్రకటించారు. రెండు కార్లు మాత్రం ఉన్నాయి. బ్యాంకుల్లో రూ.25.20 లక్షల డిపాజిట్లు, భార్య పేరుతో రూ.1.86 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. భార్య పేరుతో రూ.7.26 లక్షల అప్పు ఉందని వెల్లడించారు.

కేతావత్‌ శంకర్‌పై 21 కేసులు!

కేతావత్‌ శంకర్‌పై మొత్తం 21 కేసులున్నాయి. తెలంగాణ ఉద్యమంలో వివిధ దశల్లో పెట్టిన కేసులతోపాటు ఇతర కేసులున్నట్లు తెలిపారు. తనతోపాటు భార్య పేరుతో దిలావర్‌పూర్‌లో రూ.21 లక్షల విలువ గల 10.53 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, మొత్తం స్థిరాస్తుల విలువ రూ.41 లక్షలని ప్రకటించారు.

రాములమ్మకు కారు లేదు..!

విజయశాంతి తన మొత్తం ఆస్తులు రూ.113 కోట్లు అని ప్రకటించారు. తన కుటుంబానికి రూ.112 కోట్ల విలువ గల భూములున్నాయని తెలిపారు. చెన్నైలోని కోయంబేడులో తనపేరుతో రూ.67.50 కోట్ల విలువగల భూమి, తన భర్త పేరుతో హైదరాబాద్‌లో రూ.45 కోట్ల విలువ గల 371 గజాల స్థలం ఉందని వెల్లడించారు. 2.47 కిలోల బంగారం ఉందని, దీని విలువ రూ.1.98 కోట్లుగా ఉందని వివరించారు. బ్యాంకులో రూ.1.01 కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. 2009లో కేసీఆర్‌ అరెస్టుకు నిరసనగా సంగారెడ్డిలో చేసిన ఆందోళనకు సంబంధించి కేసుతోపాటు హనుమకొండలో పలు కేసులున్నట్లు తెలిపారు.

Subscribe for notification