Kotamreddy sensational statement: ఎస్పీ తెలిసీ చెప్పలేదు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Kotamreddy sensational statement: నెల్లూరు రాజకీయాలు ఏపీ రాష్ట్రాన్ని షేక్ చేస్తున్నాయి. మొన్నటిదాకా అరుణ వ్యవహారం.. ఇప్పుడేమో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర.. మొత్తంగా ఈ ఘటనలు నెల్లూరు నగరాన్ని మాత్రమే కాదు.. యావత్ ఏపీలో చర్చకు కారణమవుతున్నాయి. ఇటీవల జైలు నుంచి విడుదలైన నేరమయ చరిత్ర ఉన్న వ్యక్తికి ప్రధాన అనుచరుడైన వ్యక్తి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను అంతం చేయాలని.. అతడిని అంతం చేస్తే భారీగా డబ్బులు వస్తాయని ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ వీడియో బయటకి రావడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. దీనిపై శ్రీధర్ రెడ్డి స్పందించారు. శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

“నిన్న నేను ఒక వీడియో చూసి ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యాను. నెల్లూరు లో హుందా రాజకీయాలకు నెల్లూరు చిరునామా. అటువంటిది ఇలాంటి రౌడీషీటర్ రాజకీయాలు చేయడం ఇబ్బందికరంగా ఉంది. ఈ వీడియో వచ్చిన తర్వాత మూడు రోజుల ముందు నుంచే సమాచారం ఉందని ఎస్పీ చెబుతున్నారు. కానీ నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. నాకు ఎటువంటి జాగ్రత్తలు కూడా వివరించలేదు. నన్ను చంపేస్తే డబ్బే డబ్బు అంటూ రౌడీ షీటర్లు వ్యాఖ్యానించారు. వారికి ఎవరు డబ్బు ఇస్తామన్నారు.. ఇది నేను ఒక పౌరుడుగా అడుగుతున్నాను.. పోలీసులు దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. నేను ఎవరిపై కూడా అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. ఆరోపణలు చేయడం లేదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే వైసీపీ, వారి సోషల్ మీడియా, రోత పత్రిక భుజాలు తడుముకుంటున్నది. వైసిపి తన బాధ్యతలను పూర్తిగా మర్చిపోయింది. వారి నాయకుడు అసెంబ్లీకి రాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. నా హత్యకు నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర పన్నాడని వైసిపి ఆరోపిస్తోంది. అటువంటి సంప్రదాయం మా ఇంట్లో లేదని” శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అది మీ డీఎన్ఏ లోనే ఉంది
“రాజ్యం కోసం సొంత ఇంట్లో వాళ్ళను చంపే రాజకీయం మీ డీఎన్ఏ లోనే ఉంది. బెదిరింపులకు నేను భయపడే వ్యక్తిని కాదు. వీఆర్ కాలేజ్ నుంచి పోరాటాలు చేశాను. రౌడీలను విద్యార్థి నాయకుడిగా ఉండి తరిమివేసిన ఘనత నాకుంది. నా చరిత్ర ఇలాంటిదే వైసీపీ నేతలకు బాగానే తెలుసు. వారితో కలిసి చాలా రోజులపాటు పనిచేశాను. పాతిక సంవత్సరాలు నాదే రాజ్యం అని విర్రవీగిన సమయంలోనే జగన్ నుంచి బయటకు వచ్చాను. అప్పుడు కూడా నాకు బెదిరింపులు వచ్చాయి. నా కుటుంబ సభ్యులను బెదిరించారు. అయినప్పటికీ నేను దీనిని లెక్కపెట్టలేదు. బండికి కట్టి తీసుకువెళ్లి లేపేస్తానని నన్ను ఒకడు అన్నాడు. అప్పుడే నేను భయపడలేదు. నేను తప్పు చేయను. భయపడాల్సిన అవసరం లేదు. కార్యకర్తల కోసం దేన్నైనా సరే నేను ఎదుర్కొంటాను. ఈ విషయాన్ని వైసిపి గుర్తుపెట్టుకోవాలి. నామీద ఎన్ని రకాల వీడియోలు బయటకు వచ్చిన సరే వైసిపి సోషల్ మీడియాలో పెట్టుకుంటుందేమో. కార్యకర్తలు వారు తమ కుటుంబ సభ్యుడిగా నన్ను చూస్తున్నారు. వారందరూ కూడా నన్ను నమ్మారు. మీ బుడ్డ బెదిరింపులకు నేను కాదు కదా.. నా కార్యకర్తలు కాదు కదా.. నా ఆరు సంవత్సరాల మనవడు కూడా భయపడడని” శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వైసీపీని టార్గెట్ చేసే విధంగా ఉన్నాయి. మరి దీనిపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.

Leave a Comment