
దిశ, వెబ్‌డెస్క్: ఆయా దేశాలపై ప్రతికార సుంకాలతో రెచ్చిపోతున్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు ట్రంప్ టారిఫ్‌లు చాలా వరకు రాజ్యాంగవిరుద్ధమన అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పును వెలువరిచింది. అత్యవసర ఆర్థిక అధికారాలను తుంగలో తొక్కి వివిధ దేశాలపై యథేచ్ఛగా టారీఫ్‌లు విధించారని 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. భారీగా విధించిన సుంకాలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేశాయని కోర్టు పేర్కొంది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్‌లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. అయితే, కోర్టు ఇచ్చి తీర్పును యూఎస్ సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు పిటిషనర్లను అనుమతించింది. ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పుపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కోర్టు తీర్పు అమెరికాను నాశనం చేస్తుందని కామెంట్ చేశారు. అన్ని టారిఫ్‌లు ఇప్పటికీ అమలులో ఉన్నాయని.. తమకు సుప్రీం కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
కాగా, అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA)ను అమలు చేశారు. అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీగా టారీఫ్‌లు విధించారు. బేస్‌లైన్‌గా 10 శాతం టారిఫ్‌లు విధించారు. ఇక భారత్‌పై తొలుత 26 శాతం టారిఫ్‌లు విధించగా, రష్యా నుంచి భారత్ చమురును తక్కువకు కొని లబ్ధి పొందుతోందని అనంతరం వాటిని 50 శాతానికి పెంచారు. ఈ నెల 27 నుంచి పెంచిన టారిఫ్‌లు అమల్లోకి వచ్చిన విషయం విదితమే.