: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్
అమరావతి, ఆంధ్రప్రదేశ్ లపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్ ని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదని లోకేశ్ హెచ్చరించారు.
అమరావతిపైనా, ఆంధ్రప్రదేశ్ పైనా కక్ష ఇంకా తీరలేదా? అంటూ ప్రశ్నించారు. తమిళనాడులోని వీడియోని తెచ్చి అమరావతిలో అంటూ ఫేక్ చేయించారని మండిపడ్డారు. అమరావతి అందరిదీ అని.. ఇక్కడ వివక్ష ఉండదని పేర్కొన్నారు. ఇది బౌద్ధం పరిఢవిల్లిన నేల అనీ, కుల, మత, ప్రాంతాలకు అతీతమైన ఆత్మీయ బంధంతో ప్రజలు కలిసిమెలిసి ఉంటారన్నారు.
ప్రాంతాల మధ్య విద్వేషాలు, కులాల కుంపట్లు, మతాల మధ్య మంటలు రేపి చలి కాచుకునే జగన్ రెడ్డి కుతంత్రాలకు కాలం చెల్లిందని అన్నారు. కులాల కలహాలు రేపే కుట్రలు అమలు చేసిన కిరాయి మూకల ఆటను చట్టం కట్టిస్తుందని పేర్కొన్నారు. దీని వెనకుండి నడిపిస్తున్న జగన్ రెడ్డి చట్టం ముందు దోషిగా నిలవక తప్పదని హెచ్చరించారు.