ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తేనే సరిపోదు..

ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తేనే సరిపోదు..

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు కొత్త ప్రభుత్వంతో 20 నెలల హనీమూన్ ముగిసింది. ఒక్కొక్క సమూహం దశల వారీగా ఆందోళన బాట పడుతూ, తమ సమస్యల పరిష్కారానికై గొంతెత్తుతున్నారు. ఉద్యోగ సంఘాలు కొత్త ప్రభుత్వమని మొదట్లో సంయమనం పాటిస్తే ప్రభుత్వం మెల్లిగా సన్నాయి నొక్కులు ప్రారంభించింది. అధికారంలోకి రాగానే ఉద్యోగుల పట్ల వైఖరి మారిపోయిందని ఆగ్రహం ప్రకటిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పీఆర్సీ అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర కాలం దాటినా అతి గతి లేకుండా పోయింది. ప్రభుత్వం ఒకటో తారీఖు నాడు జీతాలు ఇవ్వడమే గొప్ప అన్నట్టుగా ఉద్యోగులను నిస్సహాయ స్థితిలోకి నెట్టివేసి తమాషా చూస్తోంది.

న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం..

అధికారంలోకి వచ్చాకా రెండు డీఏలు ఇచ్చినప్పటికీ, ఇంకా 5 డీఏలు పెండింగులో పడిపోయాయి. రిటైర్డ్ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వడం లేదు. జీపీఎఫ్ డబ్బులు కూడా తీసుకోలేని స్థితి ఏర్పడింది. జీవిత కాలాన్ని సర్కారు సేవలో గడిపిన ఉద్యోగులు మలి సంజెలో తమకు న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం న్యాయస్థానాల మెట్లు ఎక్కాల్సి రావడం, ధర్నా చౌక్‌లో గొంతెత్తాల్సి వచ్చింది. చర్చలు, కమిటీలు అంటూ దాటవేత ధోరణిని ఉద్యోగులు నిరసిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల సంఘాలు, సీపీఎస్ ఉద్యోగుల సంఘాలు వేరువేరుగా సెప్టెంబర్ 1వ తేదీన ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

ఉపాధ్యాయుల సమరశంఖం

విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యేకంగా ఆందోళనకు దిగాయి. 01.7.2023 నుండి అమలు చేయాల్సిన నూతన వేతన సవరణ మాట ఎత్తకపోవడం, పెండింగ్‌లో ఉన్న 5 కరువు భత్యాల తక్షణమే విడుదల, ఆరోగ్య రక్షణ పథకాన్ని (EHS) పూర్తిస్థాయిలో నిబంధనలను రూపొందించి అమలు, కేబినెట్ సమావేశంలో ఆమోదించిన విధంగా నెలకు 700 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్లు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేయాలని కోరుతున్నాయి.

ఇచ్చిన హామీలనే అమలు చేయాలని..

2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57 మెమో ద్వారా పాత పెన్షన్ విధానం అమలు, 51శాతం ఫిట్‌మెంట్‌‌తో పీఆర్సీ అమలు, స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి జీఓ 317 బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వడం, నూతనంగా ఏర్పడిన మండలాలకు ఎంపీడీఓ, ఎంఇఓ పోస్టుల మంజూరు, సర్వే శిక్షా అభియాన్ ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని మంజూరు చేయాలనే 63 డిమాండ్లతో ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమ కార్యచరణ ప్రకటించింది. మొదటి దశలో సెప్టెంబర్ 1 నాడు సీపీఎస్ విధానం రద్దుకై హైదరాబాదులో ఆర్‌టీసీ కళ్యాణ మండపం నందు ‘పాత పెన్షన్ సాధన సదస్సు’ వేలాది మంది ఉద్యోగుల భాగస్వామ్యంతో పోరాట సదస్సు, 33 జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుపుతోంది.

పాత డిమాండ్లనే కోరుతున్నారు

ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు కొత్త డిమాండ్లను కోరడం లేదు. ఎన్నికల సందర్భంగా “అభయహస్తం” పేరుతో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నారు. ఉద్యోగులందరికీ వర్తించే వేతన సవరణ, ఐదు విడతల డీఏ, నగదు రహిత చికిత్సను అనుమతించే ఆరోగ్యకార్డుల అమలు, పెన్షన్ ప్రయోజనాలు, చెల్లింపులు సీపీఎస్ రద్దు వంటి కామన్ డిమాండ్లపై ఆచరణాత్మక చర్యలను ప్రభుత్వం వెంటనే ప్రకటించి, ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఆందోళనలను విరమింపజేయాలి. 

(సెప్టెంబర్ 1 పాత పెన్షన్ సాధనపై నిరసన ప్రదర్శనలు)

-కె. వేణుగోపాల్,

విద్యారంగ విశ్లేషకులు,

98665 14577

Leave a Comment