ఇక పప్పులుడకవ్.. విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. – Telugu News | Facial Recognition in Telangana Schools: CM Revant Reddy Plan to Improve Education Details Here

తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని అనేక సార్లు ప్రకటించిన రేవంత్‌ సర్కార్‌.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే.. విద్యాశాఖ‌పై స‌మీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణ‌లో విద్యా వ్యవ‌స్థను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో బోధన విషయంలో సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. పాఠ‌శాల‌లు నుంచి విశ్వ విద్యాల‌యాల వ‌ర‌కు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధ‌న సాగాల‌ని.. విద్యా బోధ‌న‌లో నాణ్యత ప్రమాణాలు మ‌రింత‌గా పెంచాల‌ని సూచించారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, ప్రొఫెషిన‌ల్ కోర్సులు బోధించే క‌ళాశాల‌ల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫేషియ‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్పనిస‌రి చేయాల‌ని సీఎం ఆదేశించారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగ‌వ‌డంతో పాటు ప్రొఫెష‌న‌ల్ విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరిక‌ట్టవ‌చ్చన్నారు.

తెలంగాణ‌లోని మ‌హిళా కళాశాల‌లు, బాలికల పాఠ‌శాల‌ల్లో నిర్మాణాలను వేగ‌వంతం చేయాల‌ని సీఎం ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప‌ర్యవేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వ‌స‌తుల అభివృద్ధి సంస్థ కింద‌నే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల నిర్మాణాలు కొనసాగాలన్నారు. ప్రతి పాఠ‌శాల‌లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సూచించారు.

అవ‌స‌ర‌మైతే కాంట్రాక్ట్ ప‌ద్ధతిన వ్యాయామ ఉపాధ్యాయుల‌ను నియ‌మించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన బిల్లులు త్వరితగతిన చెల్లించాలని ఆదేశించారు. ఇక విద్యా రంగంపై పెడుతున్న ఖ‌ర్చును తాము ఖ‌ర్చుగా కాక పెట్టుబ‌డిగా చూస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment