సాధారణంగా దొంగలు ఏం చేస్తారు. ఇంట్లోకి వచ్చిన బీరువాలో ఉన్న డబ్బు, నగలు, ఇతర వస్తువులు ఏవైనా ఉంటే అందినకాడికి దోచుకొని వెళ్తారు. కానీ ఇక్కడ ఒక దొంగ ఏం దొంగలించడానికి ప్రయత్నించాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఆ దొంగ ఇంట్లో చొరబడి ఒక మహిళ ఒంట్లొని రక్తాన్ని దొంగలించాలనుకున్నాడు. కానీ సడెన్గా ఆ మహిళ భర్త రావడంతో ఆ దొంగ ప్లాన్ బెడిసికొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని యాంగ్జౌ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే భర్త ఉద్యోగానికి వెళ్లడంతో ఇంట్లో భార్య మాత్రమే ఉంది. సరిగ్గా అదే టైంలో లీ అనే ఒక దొంగ వారి అపార్ట్మెంట్లోకి దూరాడు. రూమ్లో ఒంటరిగా ఉన్న మహిళను చూసి ఆమెకు బలవంతంగా మత్తుమందు ఇచ్చాడు.
ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె నుంచి రక్తాన్ని తీయడం ప్రారంభించాడు. ఇంతలోనే ఆ మహిళ భర్త వచ్చాడు. డోర్ దగ్గరకు చేరుకొని కాలింగ్ బెల్ కొట్టాడు. అది గమనించిన దొంగ మెల్లగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై బాధితురాలి భర్త మాట్లాడుతూ తను ఇంట్లో లేని సమయంలో ఒక దొంగ చొరబడి తన భార్య ఒంట్లోంచి రక్తం కాజేయాలనుకున్నాడని తెలిపాడు. ఈ విషయం కాస్తా మీడియా వరకు వెళ్లడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని నిందితుడిని వెంటనే పట్టుకోవాలని పోలీసులకు ఆదేశించింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై అతన్ని విచారించగా ఆ దొంగ చెప్పిన విషయాలు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. తనకు దొంగతనాలంటే ఇష్టమని.. ఇలా చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అతను తెలిపినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిపై గతంలో దొంగతనం, అత్యాచారం వంటి కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.