ప్రధాని షినవత్రాకు ఉద్వాసన

థాయ్‌లాండ్‌ కోర్టు తీర్పు
బ్యాంకాక్‌ :
నైతిక ప్రవర్తన ఉల్లంఘనలకు పాల్పడినందున ప్రధాని పెటోంగ్‌ టార్న్‌ షినవత్రాను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు థాయ్‌లాండ్‌ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం వెల్లడించింది. అతిపిన్న వయసులోనే ప్రధాని అయిన షినవత్రా అధికారం చేపట్టిన ఏడాదికే ఆమె పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కోర్టు తీర్పు పార్లమెంట్‌ ద్వారా కొత్త ప్రధాని ఎన్నికకు మార్గం సుగమం చేస్తుంది. జూన్‌ నెలలో లీకైన ఫోన్‌కాల్‌లో ఆమె కంబోడియా మాజీ నేత హున్‌సేన్‌ను వేడుకుంటున్నట్లు ఉందని, కంబోడియాకు అనుకూలంగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిర్ధారణ అయిందని ధర్మాసనం పేర్కొంది. దీన్ని నైతిక ప్రవర్తన ఉల్లంఘనగా వ్యాఖ్యానించింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న సమయంలో ఆమె ఫోన్‌కాల్‌ చేశారని పేర్కొంది. షినవత్రా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని, దేశ ఖ్యాతిని దెబ్బతీశారని, దీంతో ప్రజల విశ్వాసం కోల్పోయారని కోర్టు తీర్పు చెప్పింది. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకూ డిప్యూటీ ప్రీమియర్‌ ఫుమ్తామ్‌ వెచాయుచారు బాధ్యతలు నిర్వహిస్తారు.

The post ప్రధాని షినవత్రాకు ఉద్వాసన appeared first on Navatelangana.

Leave a Comment