Araku coffee berry borer: అరకు కాఫీకి కొత్త కష్టం!

Araku coffee berry borer: అరకు కాఫీని(Araku coffee) అంతర్జాతీయ గుర్తింపు తేవాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. మార్కెటింగ్ తో పాటు విస్తృత ప్రచారం కల్పించేందుకు టాటా కంపెనీ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సైతం అరకు కాఫీకి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. ఏకంగా పార్లమెంట్ ఆవరణలో ప్రత్యేక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు అరకు కాఫీ కి కొత్త సమస్య వచ్చి పడింది. విశాఖ మన్యంలో విస్తారంగా సాగు అవుతుంది కాఫీ. కానీ ఇప్పుడు కాఫీ పంటకు బెర్రీ బోరర్ తెగులు సోకింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ పంటను నాశనం చేస్తోంది ఈ బెర్రీ బోరర్ తెగులు. ఇప్పుడు అరకు కాఫీలో సైతం ఇదే తెగులు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తొలిసారిగా అరకు కాఫీలో ఇది బయటపడింది. కేంద్ర కాపీ బోర్డు శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపడుతున్నారు.

ఇప్పుడిప్పుడే గుర్తింపు..
అరకు కాఫీ కి జాతీయంగా, అంతర్జాతీయంగా ఇప్పుడిప్పుడే గుర్తింపు లభిస్తుంది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం( state government) కృతనిశ్చయంతో ఉంది. ఇటీవల టాటా కంపెనీతో ఒప్పందం కూడా చేసుకుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఈ కొత్త తెగులు ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కాఫీ పంటను తీవ్రస్థాయిలో నాశనం చేసే తెగులు ఇది. కాఫీ బెర్రీ బోరర్ అనే కీటకం వల్ల ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. 2000లో ఈ తెగులును హవాయిలో గుర్తించారు. కాఫీ పంట పండు దశలో రంధ్రం చేసుకుని ఈ తెగులు లోపలికి ప్రవేశిస్తుంది. గింజను పూర్తిగా తొలిచివేసి సొరంగం మాదిరిగా చేసుకొని గుడ్లు పెడుతుంది. తద్వారా పూర్తిగా పంటను ఈ తెగులు నాశనం చేస్తుంది. విపరీతంగా వ్యాప్తి చెందడం ఈ తెగులుకున్న సహజ లక్షణం.

11 మండలాల్లో సర్వే..
అరకు ప్రాంతంలో వేలాది ఎకరాల్లో కాఫీ సాగు అవుతుంది. వారం రోజుల కిందట కేంద్ర కాఫీ బోర్డు( Central coffee board) అధికారులు ఇక్కడి కాఫీ గింజలలో తెగులును గుర్తించారు. అందుకే యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు మొదలుపెట్టారు. ప్రధానంగా ఏజెన్సీలోని 11 మండలాల్లో కాఫీ బెర్రీ బోరర్ తెగులు గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. ఈ తెగులు పై గిరిజన రైతులు అప్రమత్తం కావాలని కేంద్ర కాపీ బోర్డ్ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే సమాచారం అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం సైతం సత్వర చర్యలు ప్రారంభించింది. ఈ తెగులును నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Leave a Comment