Tallest Lord Ganesha Idol: కోటి లింగాలు.. లక్ష చీరలతో.. ఏపీలో దేశంలోనే అతిపెద్ద గణనాథుడు

Tallest Lord Ganesha Idol: దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మండపాలను అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. అయితే చాలాచోట్ల ప్రత్యేక గణనాధులను ఏర్పాటుచేసి వార్తల్లో నిలుపుతున్నారు. సాధారణంగా హైదరాబాదులోని ఖైరతాబాద్( Khairatabad ) వినాయకుడు, ముంబైలోని జిఎస్బి సేవా మండల్ ఏర్పాటు చేసి గణనాథుడు.. ఇలా కొన్ని మాత్రమే ప్రతిసారి వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. అయితే ఈసారి ఏపీ సైతం ఆ వార్తల సరసన చేరింది. దేశంలోనే అత్యంత ఎత్తైన వినాయకుడు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. ఏకంగా 126 అడుగుల ఎత్తు కలిగిన భారీ శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని అనకాపల్లి జిల్లాలో నిలబెట్టారు. అయితే అది పూర్తిగా మట్టితోనే తయారు చేయడం విశేషం. 45 మంది కార్మికులు.. దాదాపు రెండు నెలలు కష్టపడి ఈ భారీ వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈ విగ్రహం చోటు దక్కించుకోవడం ఖాయంగా తెలుస్తోంది.

పర్యావరణ హితం.. అనకాపల్లిలో( Anakapalli ) గ్రామ దేవత పండుగలతో పాటు వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ క్రమంలో పర్యావరణ హితం కోసం ఈ భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ శిల్పి కామదేను ప్రసాద్ పర్యవేక్షణలో 45 మంది కార్మికులు 50 రోజులపాటు శ్రమించి తయారు చేశారు. ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు 10 టన్నుల బంక మట్టిని ఉపయోగించారు. వచ్చే నెల 23 వరకు ఇక్కడ వేడుకలు కొనసాగుతాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ స్థానం పొందడమే లక్ష్యంగా ఈ భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు పూజా కమిటీ తెలిపింది.

పది టన్నుల మట్టితో
ఈ భారీ గణనాధుడి విగ్రహ తయారీ కోసం పది టన్నుల మట్టి.. మండలం ఏర్పాటు చేసేందుకు 90 టన్నుల సరుగుడు బాదులు ఉపయోగించారు. 126 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని తయారు చేసేందుకు 70 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ఈ భారీ గణనాథుడి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 23న నిమజ్జనం చేయనున్నారు.

విశాఖలో ప్రత్యేక ఆకర్షణగా..
మరోవైపు విశాఖ( Visakhapatnam) నగరంలో స్టీల్ ప్లాంట్ సమీపంలో.. కోటిలింగాలతో ఏర్పాటుచేసిన గణనాథుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏకంగా కోటి లింగాలతో ఈ విగ్రహాన్ని తయారు చేయడం విశేషం. చాలా రోజులపాటు శ్రమించి దీనిని తయారు చేశారు. మరోవైపు గాజువాకలో లక్ష చీరలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నవరాత్రులు పూర్తయిన తర్వాత.. నిమజ్జనం నాడు లక్ష చీరలను మహిళలకు పంపిణీ చేయనున్నారు. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా విశాఖలో వినాయక నవరాత్రి వేడుకలు జరుగుతుండడం విశేషం.

Leave a Comment