Indian Rupee: రూ.100 కు జపాన్ మనీ ఎంత వస్తుందో తెలుసా..? డాలర్‌తో పోలిస్తే.. – Telugu News | How much is 100 Indian rupees worth in Japan? Check price comparison of Rupee vs Japanese Yen

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో.. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో సాంకేతిక, ఆర్థిక, వ్యూహాత్మక సహకారానికి కొత్త దిశానిర్దేశం చేస్తుంది. ప్రస్తుతం 100 భారత రూపాయలకు సుమారు 168 జపనీస్ యెన్లు వస్తున్నాయి. ఒకప్పుడు 1 రూపాయికి 1.8 యెన్ ఉండేది. అయితే ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో చోటుచేసుకున్న మార్పుల వల్ల ఈ వ్యత్యాసం ఏర్పడింది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుండగా, జపాన్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. దీనివల్ల రెండు దేశాల కరెన్సీల విలువ డాలర్‌తో పోలిస్తే కొంత బలహీనపడింది.

 కీలక పెట్టుబడుల హామీ

ప్రధాని మోదీ జపాన్‌లో ఎనిమిదవసారి పర్యటించడం, ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన నమ్మకాన్ని సూచిస్తుంది. ఈ పర్యటనలో జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో జరిగిన 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాబోయే 10 ఏళ్లలో దేశంలో 10 ట్రిలియన్ యెన్లు పెట్టుబడి పెట్టడానికి జపాన్ ముందుకు వచ్చింది.

ఈ పెట్టుబడులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , సెమీకండక్టర్స్ వంటి ఆధునిక రంగాలలో పెట్టనుంది. ఇది దేశ సాంకేతిక, తయారీ రంగాలకు కొత్త ఊపునిస్తుంది. జపాన్ ఇప్పటికే దేశంలో ఐదవ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. గతంలో 2022లో 42 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ సంఖ్య 10 ట్రిలియన్ యెన్లకు చేరుకుంది.

వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్-జపాన్ సంబంధాలు కేవలం కరెన్సీ మార్పిడికి మాత్రమే పరిమితం కాకుండా.. సాంకేతికత, భద్రత, ఇంధనం, వాణిజ్యం వంటి రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యంగా విస్తరించాయి. ఉక్కు, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలలో ఇటీవల 13 బిలియన్ డాలర్లకు పైగా విలువైన 170కి పైగా ఒప్పందాలు కుదిరాయి. అమెరికాతో వాణిజ్య సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో జపాన్ వంటి బలమైన మిత్ర దేశంతో ఉన్న ఈ సంబంధాలు భారతదేశానికి చాలా కీలకమైనవి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment