Chandrababu Vs Peddi Reddy: పెద్దిరెడ్డికి చెక్.. ఆ ఫ్యామిలీతో చంద్రబాబు మాస్టర్ ప్లాన్

Chandrababu Vs Peddi Reddy: రాయలసీమపై( Rayalaseema) ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో విజయంతో.. కడప జిల్లాలో మరింత పట్టు సాధించాలని చూస్తున్నారు. ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ స్థానంపై దృష్టి పెట్టారు. గత మూడు ఎన్నికల్లో రాజంపేట టిడిపికి చిక్కలేదు. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఆ స్థానం ఉంది. 2014, 2019, 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడప తో పాటు చిత్తూరు జిల్లాల్లో విస్తరించి ఉంది ఈ పార్లమెంట్ స్థానం. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Also Read: టైమ్స్ నౌ – జేవీసీ సర్వే: బీహార్లో గెలుపు ఎవరిదంటే?

* ఇన్చార్జిగా జగన్మోహన్ రాజు రాజంపేట( rajampeta) అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్మోహన్ రాజును నియమించారు చంద్రబాబు. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ టిడిపి అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పోటీ చేశారు. కూటమి ప్రభంజనంలో సైతం ఓటమి చవి చూశారు. అయితే ఆయన మిగతా వర్గాలను కలుపుకొని వెళ్లడంలో విఫలమయ్యారు. అందుకే ఓటమి చవిచూసినట్లు నివేదికలు అందాయి. దీంతో చంద్రబాబు సైతం పట్టించుకోవడం మానేశారు. ఆయన రెండు నెలల కిందటే టిడిపికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందుకే ఇప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించి రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా సమర్థి జగన్మోహన్ రాజును నియమించారు. ఈ మేరకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు.

* హ్యాట్రిక్ విజయం..
గత మూడుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి( Mithun Reddy) . జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అండదండలు అందించడంలో ముందుంది పెద్దిరెడ్డి కుటుంబం. ఈ క్రమంలో చంద్రబాబుకు సైతం సవాల్ చేసింది. రాయలసీమ వ్యాప్తంగా పెద్దిరెడ్డి కుటుంబం హవా ఉంది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి రాజంపేటలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ఓడించే సమర్థ నాయకత్వం ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో బిజెపికి ఈ స్థానం కేటాయించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించారు. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మెజారిటీని తగ్గించగలిగారు కానీ.. ఆయనను ఓడించలేకపోయారు. అందుకే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. ముందుగా రాజంపేట పార్లమెంటు స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను బలోపేతం చేయడం ద్వారా.. పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ చెప్పాలని చూస్తున్నారు.

* రాజమండ్రిలో పెద్దిరెడ్డి కుటుంబం..
ప్రస్తుతం పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో( Rajahmundry Central Jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం రాజమండ్రిలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని.. జైల్లో ఉన్న కుమారుడికి ఇంటి భోజనం తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి హవా తగ్గింది. సొంత నియోజకవర్గం పుంగనూరు కూడా వెళ్లలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. అందుకే ఇదే సరైన సమయమని.. రాజంపేట పార్లమెంట్ స్థానంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు చంద్రబాబు. అందులో భాగంగానే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి జగన్మోహన్ రాజును ఇన్చార్జిగా నియమించారు. అయితే ఇక్కడ నల్లారి కుటుంబంతో కలిసి పెద్దిరెడ్డిని చెక్ చెప్పాలని చంద్రబాబు చూస్తున్నారు. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Leave a Comment