సబలెంక, అల్కరాజ్ ముందంజ

సబలెంక, అల్కరాజ్ ముందంజ

మూడో రౌండ్‌లో పౌలిని, అండ్రీవా
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో రెండో సీడ్ కార్లొస్ అల్కరాజ్, ఆరో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) రెండో రౌండ్‌లో విజయం సాధించి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్, డిఫెండింగ్ ఛాంపియన్ అరినా సబలెంక (బెలారస్), ఐదో సీడ్ మిరా అండ్రీవా (రష్యా) మూడో రౌండ్‌లో ప్రవేశించారు. ఏడో సీడ్ జస్మయిన్ పౌలిని (ఇటలీ), ఎలిసె మార్టెన్స్ (బెల్జియం) తదితరులు కూడా రెండో రౌండ్‌లో జయకేతనం ఎగు వేశారు. మార్టెన్స్ 62, 63తో లులు సున్ (ఆస్ట్రేలియా)ను ఓడించింది.

పౌలిని కూడా అలవోక విజయంతో మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. అమెరికా క్రీడాకారిణి ఇవా జొవిక్‌తో జరిగిన పోరులో పౌలిని 63, 63తో జయభేరి మోగించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన పౌలిని ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు దూకుడుగా ఆడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అండ్రీవా కూడా రెండో రౌండ్‌లో అలవోకగా నెగ్గింది. రష్యాకే చెందిన పొటపొవాతో జరిగిన పోరులో అండ్రీవా 61, 63తో విజయం సాధించింది. ప్రారంభం నుంచే అండ్రీవా తన మార్క్ ఆటతో ముందుకు సాగింది. కళ్లు చెదిరే షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తించింది. చివరి వరకు జోరును కొనసాగిస్తూ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే రెండు సెట్లను తన ఖాతాలో వేసుకుని మూడో రౌండ్‌లో ప్రవేశించింది. మరో మ్యాచ్‌లో వొండ్రుసొవా (చెక్) విజయం సాధించింది.

అమెరికాకు చెందిన కెస్లర్‌తో జరిగిన రెండో రౌండ్‌లో వొండ్రుసొవా 76, 62తో జయకేతనం ఎగుర వేసింది. మరోవైపు టాప్ సీడ్ సబలెంక కూడా మూడో రౌండ్‌కు చేరుకుంది. రష్యాకు చెందిన పొలిన కుదెర్‌మెటొవాతో జరిగిన రెండో రౌండ్‌లో సబలెంక 76, 62తో విజయం సాధించింది. తొలి రౌండ్‌లో సబలెంకకు ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైంది. అయితే టైబ్రేకర్‌లో సబలెంక సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే విజయాన్ని అందుకుని మూడో రౌండ్‌లో ప్రవేశించింది.

ఎదురులేని కార్లొస్

పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కార్లొస్ అల్కరాజ్ అలవోక విజయంతో మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో అల్కరాజ్ 61, 60, 63తో ఇటలీకి చెందిన మట్టిచా బెల్లుసిపై విజయం సాధించాడు. ఆరంభం నుంచే అల్కరాజ్ దూకుడుగా ఆడాడు. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తించాడు. ఇదే క్రమంలో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. షెల్టన్ కూడా రెండో రౌండ్‌లో అలవోక విజయాన్ని అందుకున్నాడు. స్పెయిన్ ఆటగాడు కరెనొ బుస్టాతో జరిగిన పోరులో షెల్టన్ 64, 62, 64తో జయభేరి మోగించాడు.

పూర్తి ఆధిపత్యం చెలాయించిన షెల్టన్ వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. అయితే 11వ సీడ్ హోల్గర్ రూనే (డెన్మార్క్) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. జర్మనీ ఆటగాడు స్ట్రఫ్‌తో జరిగిన ఐదు సెట్ల హోరాహోరీ సమరంలో పోరాడి ఓడాడు. ఇక ఐదో సీడ్ జాక్ డ్రాపర్ (బ్రిటన్) గాయం వల్ల టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో అతని ప్రత్యర్థి బెర్గ్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.

Leave a Comment