Hyderabad: డ్రగ్స్‌ కేసుల్లో కొత్త కోణం.. దొరకకుండా ఉండేందుకు ఏం చేస్తున్నారో తెలుసా? – Telugu News | Excise officials seize 102 bottles of banned cough syrup, two sellers arrested

తెలంగాణలో డ్రగ్స్‌ మహమ్మారిని చిత్తు చేయడమే టార్గెట్‌గా ఈగల్‌ టీమ్‌ డేగ కన్నేసి దాడులు చేస్తోంది. డ్రగ్స్‌, గంజాయి సమూల ప్రక్షాళనే లక్ష్యంగా స్పెషల్‌ ఆపరేషన్లతో పెడ్లర్లకు చెమటలు పట్టిస్తోంది. వాళ్లు.. వీళ్లు అనే తేడా లేకుండా దొరికినోళ్లను దొరికినట్లు మడతపెట్టేస్తోంది. అయితే ఇటీవల గచ్చిబౌలిలో దాడులు చేసిన అధికారులు… ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ఆరుగురుని అరెస్ట్‌ చేశారు. వాళ్ల నుంచి 20 గ్రాముల కొకైన్‌, 4 గ్రాముల MDMA, 20 ఎక్స్‌టసీ పిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేయగా షాకింగ్‌ విషయాలు వెలుగులోకొచ్చాయి.

పరీక్షల్లో డ్రగ్స్‌ తీసుకున్నట్లు డిటెక్ట్‌ కాకుండా నయా టెక్నిక్‌ వాడుతున్నారు కేటుగాళ్లు. పాజిటివ్‌ రాకుండా ఏకంగా యాంటీ ఏజింగ్‌ ఇంజక్షన్స్‌ తీసుకుంటున్నారు. ఈ ఇంజక్షన్స్‌ తీసుకుంటే 24 గంటలవరకు డ్రగ్స్‌ తీసుకున్నట్లు తెలిసే ఛాన్సే లేదంటున్నారు డాక్టర్లు. అత్యంత ప్రమాదకరమైనప్పటికీ పోలీసుల కళ్లుకప్పేందుకు ఈ కొత్త ప్రయోగాలకు డ్రగ్స్‌ కన్జుమర్లు తెరలేపినట్లు వెల్లడించారు.

డ్రగ్స్‌ డిటెక్ట్‌కాకుండా వాడుతున్న యాంటీ ఏజింగ్‌ ఇంజక్షన్లు గ్లూటాక్స్‌, గ్లుటాథియోన్‌లను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే మత్తు కోసం విచ్చలవిడిగా దగ్గు మందు దందా సాగుతోందని గుర్తించారు. డ్రగ్స్‌ వాడితే దొరికిపోతామన్న భయంతో నిషేధిత దగ్గు మందులను కొందరు వాడుతున్నట్లు వెల్లడించారు. దీంతో కొందరు మెడికల్ వ్యాపారులు 190 రూపాయల విలువైన దగ్గు మందును 350 రూపాయలకు అమ్ముతున్నట్లు తేల్చారు. ప్రిస్క్రిప్షన్‌ లేకుండా యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 102 దగ్గు మందు బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా… డ్రగ్స్‌ దందా ఎలా సాగినా… కన్జూమర్లు, పెడ్లర్లు ఎన్ని వేషాలు వేసినా… క్షణాల్లో పట్టేస్తా… వాళ్ల అంతుచూస్తామంటూ ముందుకెళ్తున్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Comment