– Advertisement –
వాషింగ్టన్ : అమెరికాలో విద్యాభ్యాసం నిమిత్తం అరు లక్షల మంది చైనా విద్యార్థులను అనుమతించాలన్న తన నిర్ణయాన్ని దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్ధించుకున్నారు. వారు లేకుంటే అమెరికా కాలేజీలు దెబ్బతింటాయని చెప్పారు. అయితే ‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ వైఖరికి, గతంలో అమలు చేసిన పరిమిత వీసా విధానాలకు ఇది భిన్నంగా ఉన్నదని కన్సర్వేటివ్ మిత్రులు విమర్శలు కురిపించారు. ‘వారి విద్యార్థులను అనుమతించకూడదంటూ చాలా కథనాలు నేను విన్నాను. అమెరికాలోకి వారి విద్యార్థులను మేము అనుమతించబోతున్నాము. ఇది చాలా ముఖ్యం. ఆ ఆరు లక్షల విద్యార్థులు చాలా ముఖ్యం. కానీ మనం చైనాతో కలిసి ముందుకు సాగుతున్నాం’ అని శ్వేతసౌధంలో ట్రంప్ విలేకరులకు తెలిపారు. చైనా, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘విదేశీ విద్యార్థులు స్వదేశానికి వెళ్లిన తర్వాత పాఠశాలలు నెలకొల్పి వాటిని నడుపుతారని, అందువల్ల వారిని అనుమతించకూడదని అనడం అవమానకరమని నేను అనుకుంటున్నాను. వారి విద్యార్థులు ఇక్కడికి రావడాన్ని నేను ఇష్టపడతాను. వారు రాకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా? మన కాలేజీ వ్యవస్థ త్వరగానే కూలిపోతుంది. అవి ప్రముఖ కళాశాలలు కాలేవు. చాలా ఇబ్బందులు పడతాయి’ అని ట్రంప్ వివరించారు. కఠినమైన పరిశీలన జరిపితే అనేక అమెరికా కాలేజీలు ఆర్థికంగా దెబ్బతింటాయని చెప్పారు. కాగా చైనా విద్యార్థుల రాకను ‘మాగా’ ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2019-20లో అమెరికాలో చైనా విద్యార్థుల నమోదు గరిష్ట స్థాయికి…అంటే 3,72,000కు చేరింది. కానీ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో 2023లో ఆ సంఖ్య 2,77,000కు పడిపోయింది.
– Advertisement –