ప్రకాశం బ్యారేజీకి మళ్లీ భారీగా వరద ప్రవాహం ..

ప్రకాశం బ్యారేజికి ఇన్ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కుల వరద నీరు

69 గేట్లను పూర్తిగా ఎత్తి మొత్తం వరద నీరు దిగువకు విడుదల
లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీని ఫలితంగా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద నీటితో కృష్ణా, గోదావరి నదులు ఉరకలెత్తుతూ సముద్రంలో కలుస్తున్నాయి. వారం రోజుల క్రితం ధవళేశ్వరం నుంచి పది లక్షల క్యూసెక్కులకు పైగా గోదావరి వరద నీరు, ప్రకాశం బ్యారేజీ నుంచి సుమారు 5 లక్షల క్యూసెక్కులకు పైగా కృష్ణానది వరద నీరు సముద్రంలో కలిసింది. ఆ తర్వాత కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రభావం తగ్గింది. అయితే, మళ్లీ రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ క్రమంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 3,13,354 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో 69 గేట్లను పూర్తిగా ఎత్తి అంతే మొత్తం నీటిని కృష్ణా నదిలోకి దిగువ దిశగా విడుదల చేస్తున్నారు.

పులిచింతల నుండి వరద ఉద్ధృతి

ఎగువ ప్రాంతమైన పులిచింతల ప్రాజెక్టు నుంచి కూడా వరద ప్రవాహం భారీగా వచ్చి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతానికి పులిచింతలకు ఇన్ ఫ్లో 3,48,727 క్యూసెక్కులు ఉండగా, అధికారులు 3,73,816 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, మరో రెండు మూడు గంటల్లో ప్రకాశం బ్యారేజీ వద్ద ఁమొదటి ప్రమాద హెచ్చరికఁ జారీ చేసే అవకాశం ఉంది.

నదీ పరీవాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కృష్ణా నది పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదీ పరీవాహక ప్రాంత పొలాల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు.

Leave a Comment