తెలంగాణలో వరద బీభత్సం..

రంగంలోకి దిగిన సైన్యం, వాయుసేన
తెలంగాణను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదలు

సహాయక చర్యల కోసం రంగంలోకి భారత సైన్యం
కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో చిక్కుకున్న 30 మంది
బాధితుల రక్షణకు వాయుసేన హెలికాప్టర్ ఏర్పాటు
కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో రాజ్‍నాథ్ సింగ్ ఆదేశాలు
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర వరదలకు దారితీశాయి. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వరద నీటిలో సుమారు 30 మంది చిక్కుకుపోవడంతో వారిని రక్షించేందుకు భారత వాయుసేన రంగంలోకి దిగింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే స్పందించి సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. బండి సంజయ్ నేరుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని అధికారులకు తక్షణ ఆదేశాలు అందాయి. ఫలితంగా, వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాయుసేన హెలికాప్టర్ సిద్ధమైంది.

మరోవైపు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వరద పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉండటంతో భారత సైన్యం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఆర్మీకి చెందిన ప్రత్యేక బృందాలు (ఫ్లడ్ రిలీఫ్ కాలమ్స్) రంగంలోకి దిగి, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నాయని సదరన్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్‌ఫోర్స్‌లు దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరిస్తూ, అడ్డంకులను తొలగిస్తున్నాయి. వైద్య బృందాలు బాధితులకు తక్షణ సేవలు అందిస్తున్నాయి. ప్రత్యేక బోట్లు, ఇతర పరికరాలతో వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు, వారికి అవసరమైన సహాయక సామగ్రిని అందజేస్తున్నారు.

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. నల్గొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టులోకి ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Comment