Smita Sabharwal : స్మితా సబర్వాల్ కు ఆరు నెలల సెలవు.. సెల్ఫీ వీడియోలో ఆవేదన.. ఏం జరుగుతోంది..

Smita Sabharwal : కెసిఆర్ ప్రభుత్వం రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చినప్పుడు.. తెలంగాణలో ముఖ్యంగా సీఎంవోలో స్మిత సబర్వాల్ చక్రం తిప్పారు. మిషన్ భగీరథ ప్రత్యేక అధికారిగా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అప్పట్లో ఒకానొక సందర్భంలో ఆమె నెక్స్ట్ టు సీఎం గా ఉండేవారు. ఈమెతో పాటు ప్రియాంక వర్గీస్ అనే మహిళ అధికారిణి కూడా అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. స్మితా సబర్వాల్ ను కించపరుస్తూ ఓ మ్యాగజిన్ అడ్డగోలుగా కార్టూన్ ప్రచురించినప్పుడు.. లీగల్ నోటీసులు పంపించారు. అయితే ఈ కేసు విచారణకు స్మిత సబర్వాల్ ఏకంగా ప్రభుత్వ సొమ్మును ఉపయోగించారు. దీనినిబట్టి అప్పటి ప్రభుత్వంలో ఆమె స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్మితను పక్కన పెట్టారు. ప్రాధాన్యం లేని పోస్టు కట్టబెట్టారు. అయితే పలు సందర్భాల్లో స్మిత తన అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన తొలి రోజుల్లో కీలకమైన ఫైల్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్మిత సహకరించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. పైగా కల్లబొల్లి కబుర్లు చెప్పారని కొంతమంది మంత్రులు వ్యాఖ్యానించడం విశేషం.. అప్రధాన్య పోస్ట్ కేటాయించిన తర్వాత స్మిత ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. వాటిని సహజంగానే భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా ప్రధానంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇది కొద్ది రోజుల వరకు విజయవంతంగా నడిచింది. ఆ తర్వాత ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించడంతో స్మిత తన దూకుడు తగ్గించుకోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు స్మిత వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.. ఆమె ఒక సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశారు..

స్మిత సబర్వాల్ ప్రస్తుతం లాంగ్ లీవ్ లో ఉన్నారు. ప్రభుత్వం ఆమెకు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేసింది. ఆగస్టు ఒకటి నుంచి వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఆమె సెలవులో ఉంటారు. ఆమె ధమనులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆమెకు వచ్చిన వ్యాధిని వెర్టెబ్రల్ ఆర్టిరీ డిసెక్షన్ అని పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన వారికి వెన్నుపూస ధమని తీవ్రంగా ప్రభావితం అవుతుంది. మెదడు, వెన్నెముకకు ఆక్సిజన్ సరఫరా చేసే ఈ ధమనిలో మూడు కణజాల పొరలలో ఒకటి లేదా రెండు చీలిపోతాయి. అందువల్ల రక్త ప్రవాహం ప్రభావితమవుతుంది. ఆక్సిజన్ కూడా మెదడుకు సరిగ్గా ఉండదు. వెన్నెముక కూడా ప్రభావితమవుతుంది. ఇది ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. అరుదైన సందర్భాల్లో ప్రాణాలు కూడా పోవచ్చు. ప్రస్తుతం ఈ వ్యాధికి స్మిత సబర్వాల్ చికిత్స తీసుకుంటున్నారు..” ఇది చాలా నొప్పితో కూడుకున్న ప్రక్రియ. కొన్ని నెలలుగా నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను. చికిత్స పూర్తి అయిన తర్వాత నేను మళ్ళీ బలంగా రూపాంతరం చెందుతానని” సెల్ఫీ వీడియోలో స్మిత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్మిత సెల్ఫీ వీడియో నేపథ్యంలో నెట్టింట రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

Leave a Comment