Byreddy Shabari to get minister post: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోదీ( Prime Minister Narendra Modi) ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దసరాకు ముందే క్యాబినెట్ ను విస్తరించి.. మరింతమందికి పదవులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏడాది బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడులో సైతం ఎన్నికలు రానున్నాయి. బీహార్లో ఎన్డీఏ కు ధీటుగా ఇండియా కూటమి ఉంది. అక్కడ అధికారాన్ని పదిలం చేసుకునేందుకు ఎన్డీఏ సర్వశక్తులు ఒడ్డుతోంది. అందులో భాగంగా వీలైనంత కేంద్ర మంత్రి పదవులు ఆ రాష్ట్రానికి ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు తమిళనాడులో అన్నా డీఎంకేతో కలిపి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. అందుకే ఆ రాష్ట్రానికి చెందిన బిజెపి మాజీ చీఫ్ అన్నామలైకు కేంద్ర క్యాబినెట్లో చోటు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభకు పంపించి కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు ఏపీకి సైతం ఈసారి ఒక మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని సమాచారం.
ఎంపికలో చంద్రబాబు..
ఏపీలో ( Andhra Pradesh)టిడిపి కూటమి ఘనవిజయం సాధించింది. 21 ఎంపీ స్థానాలను సైతం కైవసం చేసుకుంది. 16 ఎంపీ స్థానాలను తెలుగుదేశం పార్టీ, మూడు పార్లమెంట్ స్థానాలను బిజెపి, రెండు స్థానాలతో జనసేన నిలిచింది. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏపీలో కూటమి దోహదపడింది. ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులు అయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీకి మరో కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
ఈసారి రాయలసీమకు..
కింజరాపు రామ్మోహన్ నాయుడు( Ram Mohan Naidu) ఉత్తరాంధ్రాకు చెందిన నేత. పెమ్మసాని చంద్రశేఖర్ కోస్తాంధ్రకు చెందిన ఎంపీ. అందుకే ఈసారి రాయలసీమకు మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. అయితే అనంతపురం తో పాటు చిత్తూరు ఎంపీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేరు కూడా బయటకు వచ్చింది. మంచి వాగ్దాటి ఉన్న మహిళ నేతగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. లోక్సభలో సైతం తనదైన శైలిలో ప్రసంగిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను సైతం గట్టిగానే ఎదుర్కొంటున్నారు. ఆపై విద్యాధికురాలు కూడా. కుటుంబ నేపథ్యం కూడా ఆమెకు కలిసి వస్తోంది. ఆది నుంచి బైరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో కొనసాగింది. శబరి తండ్రి రాజశేఖర్ రెడ్డి టిడిపిలోనే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అందుకే చంద్రబాబు ఆమెకే ఈ పదవి ఇస్తారని తెగ ప్రచారం నడుస్తోంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.