PKL 2025: క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది.. కబడ్డీ కోర్టులో నా సత్తా ఏంటో చూపిస్తా.. నీలో ఎన్ని టాలెంట్లున్నాయ్ బుడ్డోడా – Telugu News | IPL Sensation Vaibhav Suryavanshi to Inaugurate Pro Kabaddi League

PKL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో రాజస్థాన్ రాయల్స్ (RR) ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అద్భుతమైన సెంచరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ 14 ఏళ్ల యువ సంచలనం ప్రో కబడ్డీ లీగ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్‌లో కూడా తన బ్యాటింగ్‌తో వైభవ్ అదరగొట్టాడు. ఇప్పుడు అతను ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్‌కు ఆహ్వానించబడ్డాడు. ఇది చాలా గొప్ప విషయం. ప్రో కబడ్డీ లీగ్ 2025 ఆగస్టు 29న విశాఖపట్నంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రారంభం కానుంది. ఈ సీజన్‌ను అండర్-19 జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ప్రారంభించనున్నారు.

ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్‌ను బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్, భారత హాకీ మాజీ కెప్టెన్ ధనరాజ్ పిళ్లై, కబడ్డీ స్టార్ ప్రదీప్ నర్వాల్, భారత అండర్-19 ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కలిసి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వైభవ్ సంతోషం వ్యక్తం చేశాడు. “నేషనల్ స్పోర్ట్స్ డే క్రీడలు అందరినీ ఎలా ఏకం చేస్తాయో నాకు గుర్తు చేస్తుంది. క్రీడలు మనకు టీమ్‌వర్క్, క్రమశిక్షణ నేర్పిస్తాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాలాంటి చిన్నపిల్లలు క్రీడల్లోకి వచ్చి తమను తాము నిరూపించుకోవాలని ఆశిస్తున్నాను” అని వైభవ్ అన్నాడు. ప్రో కబడ్డీ లీగ్ 2025లో మొదటి మ్యాచ్ తెలుగు టైటాన్స్, తమిళ తలైవాజ్ మధ్య జరగనుంది.

ఈ సీజన్‌లో ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని అందించడానికి కొన్ని కొత్త మార్పులు తీసుకొచ్చారు. మొదటిసారిగా, అన్ని మ్యాచ్‌లకు ఫలితం ఉంటుంది. లీగ్ దశలో టై అయిన మ్యాచ్‌లకు కూడా టైబ్రేకర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. లీగ్, ప్లేఆఫ్స్ మధ్య కొత్తగా ప్లే-ఇన్ దశను కూడా ప్రవేశపెట్టారు. టాప్-2 జట్లు నేరుగా క్వాలిఫై అవుతాయి, 3, 4 స్థానాల్లో ఉన్న జట్లు మినీ క్వాలిఫైయర్‌లో తలపడతాయి. 5 నుంచి 8వ స్థానంలో ఉన్న జట్లు ప్లే-ఇన్ దశలో ముందుకు వెళ్లడానికి పోరాడతాయి. అన్ని మ్యాచ్‌లను దేశంలోని నాలుగు నగరాల్లో నిర్వహిస్తారు.

ప్రో కబడ్డీ లీగ్ 2025 లీగ్ దశ మ్యాచ్‌లు విశాఖపట్నం, జైపూర్, చెన్నై, ఢిల్లీలలో జరుగుతాయి. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఆగస్టు 29న విశాఖపట్నంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. అన్ని మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మొబైల్‌లో చూడాలనుకుంటే, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

విశాఖపట్నం, జైపూర్, చెన్నైలలో డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటాయి. మొదటి మ్యాచ్ రాత్రి 8:00 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 9:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఢిల్లీలో ఒక రోజుకు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రో కబడ్డీ లీగ్ 2024 టైటిల్‌ను హర్యానా స్టీలర్స్ గెలుచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment