Duvvada Srinivas: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ మొన్నటి ఎన్నికల్లో తుడుచుపెట్టుకుపోయింది. అయితే కొంతమంది నేతలు పార్టీని వీడారు. మరికొందరు సైలెంట్ గా ఉన్నారు. అయితే కొందరు నేతల తీరుతో ఇప్పుడు పార్టీ ఇబ్బందుల్లో పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా ఆయన రెండు కుటుంబాలను టార్గెట్ చేశారు. సామాజిక అంశాన్ని తెరపైకి తెచ్చారు. తెలుగుదేశం పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సైతం కెలుకుతున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన టిడిపి ఎమ్మెల్యే కూన రవికుమార్ కు మంత్రి పదవి రాకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ కుట్రలో ధర్మాన, కింజరాపు కుటుంబాల హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. తనపై సస్పెన్షన్ కాదు కానీ.. పార్టీ నుంచి బహిష్కరించేలా చేయాలని సవాల్ చేశారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పెద్దల అభయం తనకు ఉందని సంకేతాలు పంపారు దువ్వాడ శ్రీనివాస్.
Also Read: అశ్విన్ రూటే సపరేటూ.. అప్పుడూ, ఇప్పుడూ..
* దశాబ్దాలుగా రాజకీయం..
దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వచ్చారు దువ్వాడ శ్రీనివాస్( Duvvada Srinivas) . యువజన కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. చాలాసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం.. ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓటమి చవిచూశారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ దూకుడు గల నాయకుడు. ఆపై నోటి దురుసుతనం ఎక్కువ. ఆయనకు అదే మైనస్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ధర్మాన ప్రసాదరావుకు వ్యతిరేకిగా ముద్రపడ్డారు. ధర్మాన ఓ స్థాయికి ఎదిగారు కానీ.. అదే పార్టీని నమ్ముకున్న దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఎదగలేకపోయారు. అయితే ఇప్పుడు బాహటంగానే దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన సోదరులకు సవాల్ విసురుతున్నారు. వైసీపీ నుంచి తన సస్పెన్షన్ వెనుక మంత్రి కింజరాపు అచ్చెనాయుడు హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ధర్మాన సోదరులు మంత్రితో కుమ్మక్కై తనను పార్టీ నుంచి బయటకు పంపించారని చెబుతున్నారు.
* జగన్ కు వీర విధేయుడు
తాను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) విధేయుడునేనని చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. మళ్లీ పార్టీలోకి వస్తానని కూడా తేల్చి చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కచ్చితంగా దువ్వాడ వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉందని స్పష్టం అవుతోంది. పార్టీలోకి వస్తాను. ఒక్కొక్కరి లెక్క తేల్చుతానని హెచ్చరిస్తున్నారు. ధర్మాన కృష్ణ దాస్ ను ముసలి నక్కతో పోల్చుతున్నారు. ధర్మాన సోదరులను గెలవనివ్వనని హెచ్చరిస్తున్నారు. ఏకకాలంలో ఆయన వైసీపీతో పాటు టిడిపి నేతలకు హెచ్చరికలు జారీచేస్తుండడం విశేషం. అదే సమయంలో తన సామాజిక వర్గ అంశాన్ని తెరపైకి తెస్తుండడం కూడా.. పక్కా ప్లాన్ ఉందని.. దీని వెనుక వైసీపీ స్కెచ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కచ్చితంగా వైసీపీ పెద్దల గైడ్లైన్స్ తోనే ఆయన మాట్లాడుతున్నారని చర్చ జరుగుతోంది.
* అవగాహన రాజకీయం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధర్మాన ప్రసాదరావు ( dharmana Prasad Rao )యాక్టివ్ గా లేరు. పార్టీ హైకమాండ్ కోరుతున్నా ఆయన పెద్దగా స్పందించడం లేదు. మరోవైపు ధర్మాన కృష్ణ దాసు పార్టీ జిల్లా పగ్గాలు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ధర్మాన సోదరులకు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వారు పార్టీలో ఉంటూ టిడిపితో అవగాహన చేసుకున్నారన్న అనుమానం ఉంది. ముఖ్యంగా కింజరాపు కుటుంబంతో వారికి అవగాహన ఉంది అనేది ప్రధాన వాదన. పార్టీ అధికారంలోకి వస్తేనే వారు యాక్టివ్ గా ఉన్న విషయాన్ని జగన్ గుర్తించినట్లు సమాచారం. అందుకే ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే దువ్వాడ శ్రీనివాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కొద్ది రోజుల్లో దువ్వాడ శ్రీనివాస్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి.. శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.