దీర్ఘ కాలంగా జ్వరంతో బాధపడుతున్నారా… సాధారణ ఫీవర్ లక్షణాలు ఉన్నాయా… దగ్గు, ఆయాసం తరుచుగా వస్తుందా… అయితే మీరు కొత్త రకం బాక్టీరియా బారిన పడినట్లే అంటున్నారు గుంటూరు వైద్యులు. మెలియాయిడోసిస్ జ్వర బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బర్కోల్డేరియా సుడోమాలీ అనే బ్యాక్టీరియా కారణంగా సుదీర్ఘకాలం జ్వరం వేధిస్తున్నట్లు గుర్తించామని శ్రీ ఆసుపత్రి డాక్టర్ కల్యాణ చక్రవర్తి తెలిపారు.
ఇది సాధారణమైన బ్యాక్టీరియా అని అయితే ప్రాథమిక స్థాయిలో గుర్తించి యాంటీ బయాటిక్స్ వాడితో సరిపోతుందని ఆయన తెలిపారు. కొద్దిరోజుల క్రితం తురక పాళెంకు చెందిన వెంకట్రావు అనే రోగి వచ్చాడని దాదాపు 45 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు చెప్పాడన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినా మొదట రోగ కారకం గుర్తించలేకపోయారు. ఆ తర్వాత కల్చర్ చేయగా అతనికి మెలియాయిడోసిస్ వచ్చినట్లు తేలిందన్నారు. అయితే వెంటనే యాంటిబయాటిక్స్ వాడితే రోగి కోలుకున్నాడన్నారు. అదే విధంగా ఇబ్రహీం అనే వ్యక్తికి ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతోనే ఆసుపత్రికి వచ్చాడని ఐసియులో ఉంచి వైద్యం అందించామన్నారు. సిటీ స్కాన్ లో కడుపులో గడ్డ ఉన్నట్లు తేలిందని అయితే అది క్యాన్సర్ గడ్డా కాదా అనే తేల్చేందుకు బయాప్సికి పంపించామన్నారు. అదే సమయంలో బ్లడ్ కల్చర్ చేయగా అతనికి మెలియాయిడోసిస్ ఉన్నట్లు తేలిందన్నారు.
సాధారణంగా వర్షాకాలంలో జ్వరం, జలుబుతో బాధపడటం అదే విధంగా డెంగీ, మలేరియా వ్యాధి పడటం వ్యాపించడం జరుగుతుందన్నారు. అయితే మలేరియ, డెంగీ లేకపోయినా జ్వరం తగ్గకపోవడంతో పాటు ప్రాణాంతకంగా మారడంతో అనుమానం వచ్చి కల్చర్ చేయించడంతో మెలియాయిడోసిస్ బయటపడుతున్నట్లు తేలిందన్నారు. ఈ మధ్యకాలంలో నలుగురు రోగులు ఈ బ్యాక్టిరియా బారిన పడి వచ్చినట్లు ఇన్ఫెక్షియస్ వ్యాధుల నిపుణుడైన కల్యాణ చక్రవర్తి చెప్పారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి యాంటీ బయాటిక్స్ వాడితే తగ్గిపోతుందన్నారు. లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందన్నారు.
తేమగా ఉన్న నేలల్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువుగా ఉంటుందని, చెప్పులు లేకుండా తిరిగే వాళ్లకి ఈ బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ బ్యాక్టీరియా బారిన పడకుండా ఉండే అవకాశం ఉందన్నారు.