Vijay case : తమిళనాడు భవిష్యత్తును సమూలంగా మార్చడానికి రాజకీయాల్లోకి వచ్చారు టీవికే అధినేత విజయ్. తమిళ చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ నటుడిగా విజయ్ కి పేరుంది. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో అతనికి అభిమానుల ప్రోత్సాహం ఉంది. అందువల్లే అతడు టీవీకే పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశాడు. గతంలో ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించిన అతడు.. ఇటీవల మానాడు పేరుతో మధురైలో భారీ సభను నిర్వహించాడు. ఈ సభకు భారీ ఎత్తున జనం వచ్చారు. సోషల్ మీడియా, మీడియాలో టీవీకే బహిరంగ సభ సరికొత్త రికార్డులు నెలకొల్పింది.. రికార్డు స్థాయిలో విజయ్ ప్రసంగాన్ని నెటిజన్లు వీక్షించారు.
వివాదంలో..
మధురై లో నిర్వహించిన మానాడు సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో అనేక వివాదాలకు కారణమయ్యాయి. అధికార డిఎంకె, అన్నా డీఎంకే, బిజెపి నాయకులు విజయ్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కూడా విజయ్ ని విమర్శిస్తున్నారు. ఏమాత్రం అనుభవం లేకుండా అడ్డగోలుగా అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగానే విజయ్ పై తమిళనాడులో కేసు నమోదు అయింది. మధురై లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న క్రమంలో.. విజయ్ అభిమానులకు అభివాదం చేస్తుండగా.. కొంతమంది విజయ్ వద్దకు వచ్చారు. బాన్సర్లు వారిపై దాడి చేసి కిందికి తోసి వేశారు. అందులో ఒక అభిమాని కిందపడ్డాడు. అతడికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో శరత్ కుమార్ అనే అభిమాని పోలీస్ స్టేషన్లో టీవీకే అధినేతకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు అయింది. బౌన్సర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఎన్నికలలో పోటీ చేస్తారా?
ఇటీవల కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చింది. కేసులు ఉన్నవాళ్లు పదవుల్లో కొనసాగే అవకాశం లేదని ఆ చట్టం ఉద్దేశం. దీనిని కేంద్ర హోం శాఖ మంత్రి ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దీనిపై విపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి చట్టం వచ్చిన నేపథ్యంలో విజయ్ పై కేసు నమోదు కావడం సంచలనం కలిగిస్తోంది. ఒకవేళ ఇటువంటి కేసులు ఇలా నమోదు అవుతూ ఉంటే విజయ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరికొందరేమో ఇలాంటి కేసులు ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయలేవని.. ఇవన్నీ సర్వ సాధారణమని పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ విజయ్ మీద కేసు నమోదు కావడం పట్ల ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదంతా కుట్ర అని చెబుతున్నారు. వీటన్నింటిని విజయ్ చేదించుకొని బయటపడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.