Ponnam Prabhakar: ఆ 40 ఓట్లు హిందువుల ఇళ్లలోనివే.. బండి సంజయ్ పై మంత్రి పొన్నం హాట్ కామెంట్స్

Ponnam Prabhakar: ఆ 40 ఓట్లు హిందువుల ఇళ్లలోనివే.. బండి సంజయ్ పై మంత్రి పొన్నం హాట్ కామెంట్స్

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: బండి సంజయ్ తాను దొంగ ఓట్లతో గెలవలేదు అనుకుంటే ఎన్నికల కమిషన్ కు లేఖ రాసి తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓట్ల సరళిని పరిశీలించమని కోరాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణలో ఓట్ల చోరీతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచి ఉండవచ్చని పీసీసీ చీఫ్ అనుమానం వ్యక్తం చేస్తే బండి సంజయ్ ఎందుకు (Bandi Sanjay) ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్.. మొన్న కరీంనగర్ లో ఒక ఇంట్లో 40 ఓట్లు బయటపడ్డాయని ఆ ఓట్లు హిందువుల ఇళ్లలోనే ఉన్నాయన్నారు. తాను దొంగ ఓట్లకు వ్యతిరేకం అని బండి సంజయ్ చెప్పదల్చుకుంటే ఈ విషయంలో ఈసీకి లేఖ రాయాలన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓట్ల చోరీకి సంబంధించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్ష చేసి బీజేపీ ఓట్ల కుట్రలు బయటపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కోరుతున్నట్టు చెప్పారు.

బీజేపీ ఓట్ల కొరకు మాత్రమే భగవంతుడిని వాడుకుంటుందని పొన్నం విమర్శించారు. అక్షింతలు, శ్రీరాముడు పేరును బండి సంజయ్ ఎన్నికల్లో ఉపయోగించుకున్న విషయం అందరికీ తెలుసని అన్నారు. బీజేపీ అధ్యక్షుడుగా మిమ్మల్ని తొలగిస్తే మహేశ్ కుమార్ తో పాటు అనేక మంది బీసీ నాయకులు మా బలహీన వర్గాల నాయకుడిని ఎలా తొలగిస్తారని బండి సంజయ్ కి మద్దతుగా నిలిచామని గుర్తు చేశారు. బీసీలకు న్యాయం చేయడానికి 42 శాతం రిజర్వేషన్ల చట్టం చేస్తే మతం పేరుతో బీజేపీ అడ్డుపడుతున్నదని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల విషయంలో మీ పార్టీని ఒప్పించలేక దూదేకుల పేరుతో తెలంగాణ బీసీలకు అన్యాయం చేస్తే మిమ్మల్ని ఏమనాలి అని పొన్నం ప్రశ్నించారు. వెనుకబడిన ముస్లింలకు అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోని కారణంగా ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయన్నారు.

మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని మీరు ఈ 10 శాతం తెచ్చినా మేము అడ్డుకోలేదన్నారు. పేదలందరికీ న్యాయం జరగాలనే చెప్పామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బీసీ బిల్లులో మతపరమైన రిజర్వేషన్లు లేవని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకరే చెప్పారు. మతం పేరుతో బీసీ రిజర్వేషన్లకు కాలు అడ్డం పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేయవద్దన్నారు. బీసీ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రాన్ని ఎంపీలు ఈటెల రాజేందర్, అర్వింద్ ఒప్పించాలన్నారు. ఆర్.కృష్ణయ్య ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని బలహీన వర్గాలకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తే చరిత్ర క్షమించదన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ తో ఏ విధంగా పోరాడామో ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి మనమంతా ఐక్యంగా ఉద్యమిద్దామని పొన్నం పిలుపునిచ్చారు. ఫుట్ బాల్ లాగా మీ పార్టీ నాయకులు ఉన్నారని మీ పార్టీ ఎంపీ చెప్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ కు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. మెట్రో విస్తరణ, అల్వాల్ వైపు ,మేడ్చల్ వైపు విస్తరణకు ఎందుకు అనుమతులు తేలేకపోయారని నిలదీశారు. గత పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ హైదరాబాద్ నగరానికి ఒక చుక్క నీరైనా తీసుకొచ్చిందా? అని నిలదీశారు.

Leave a Comment