– రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
– తెలంగాణ సచివాలయంలో సీఎస్ఓగా పని చేసిన గంగారాం
నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం(58) ప్రమాదవశాత్తు లిఫ్టులో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామానికి చెందిన గంగారాం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాత్రి పట్టణంలోని ఓ అపార్టుమెంట్లో లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టడంతో మూడో ఫ్లోర్ నుంచి ఒకటో ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్‌పై ఆయన పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే గంగారాం మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గంగారాంకు భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గంగారాం కమాండెంట్‌గా 17వ పోలీస్ బెటాలియన్‌కు రాకముందు తెలంగాణ సచివాలయంలో సీఎస్ఓగా పని చేశారు. ఆయన మృతితో బెటాలియన్‌తోపాటు పోలీస్‌శాఖలో విషాదం నెలకొంది. కమాండెంట్ గంగారాం భౌతిక కాయానికి జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖరరెడ్డి, 1వ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ, 3వ బెటాలియన్ కామండెంట్ జమీల్ ఫాష, 17వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు, రాందాస్, బెటాలియన్ అధికారులు, సిబ్బంది గంగారం మృతదేహానికి నివాళులు అర్పించారు.
కేటీఆర్ సంతాపం..
సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుశాఖకు ఉన్నతంగా సేవలందిస్తున్న గంగారాం ప్రమాదవశాత్తు లిప్టు ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.