
నంద్యాల జిల్లా అవుకు మండలం చెర్లోపల్లెలో నిరుద్యోగి మధు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్రిజ్ పక్కన ఉంచిన అతని ఒరిజినల్ సర్టిఫికెట్లు మంటల్లో దగ్ధమయ్యాయి. తాజా డీఎస్సీ ఫలితాల్లో మధు ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. SGT విభాగంలో 80.53 మార్కులు సాధించి.. నంద్యాల జిల్లా స్థాయిలో 773వ ర్యాంక్ సాధించారు. ఇంకో మూడు రోజుల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని అధికారుల నుంచి సమాచారం రావడంతో మధు ఆందోళన చెందుతున్నారు.
సర్టిఫికెట్లు మొత్తం కాలిపోవడంతో ఉపాధ్యాయ ఉద్యోగం కోల్పోకుండా తనకు న్యాయం చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, స్థానిక మంత్రి సహాయం చేయాలని మధు వేడుకుంటున్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించారు. మధు ఇంటికి వచ్చి జరిగిన పరిస్థితిని పరిశీలించి, విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఏదేమైనా అధికారులు తక్షణ చర్యలు తీసుకుని, మధుకు న్యాయం జరిగి ఉపాధ్యాయ ఉద్యోగం రావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు మధుకు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..