సాధారణంగా ప్రజలు గుండె జబ్బులు కేవలం కొలెస్ట్రాల్ లేదా అధిక రక్తపోటు వల్ల మాత్రమే వస్తాయని, మెదడు సమస్యలు ఒత్తిడి వల్ల వస్తాయని అనుకుంటారు. కానీ ఆహారంలో పోషకాల లోపం, ముఖ్యంగా కొన్ని విటమిన్ల కొరత కూడా ఈ అవయవాలను క్రమంగా బలహీనపరుస్తుంది. ఈ లోపాల లక్షణాలు ఆలస్యంగా కనిపిస్తాయి. అప్పటికే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. గుండె, మెదడు ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
విటమిన్ B12: నాడీ వ్యవస్థకు విటమిన్ B12 చాలా ముఖ్యమైనది. దీని లోపం వల్ల మతిమరుపు, అలసట, చిరాకు, గందరగోళం వంటి సమస్యలు వస్తాయి. గుండెకు కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది హోమోసిస్టీన్ అనే అమైనో ఆమ్లాన్ని నియంత్రిస్తుంది. హోమోసిస్టీన్ స్థాయిలు పెరిగితే, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. విటమిన్ B12 ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
విటమిన్ D: విటమిన్ D కేవలం ఎముకలకే కాకుండా గుండె జబ్బులు, మెదడు పనితీరుకు కూడా అవసరమని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో, నాడీ వ్యవస్థను చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు: ఇవి మెదడుకు సూపర్‌ఫుడ్ అని చెప్పవచ్చు. ఇవి మెదడు కణాలను మరమ్మతు చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. అలాగే గుండెలో రక్తం గడ్డకట్టకుండా నివారించి, రక్త ప్రవాహాన్ని సజావుగా ఉంచుతాయి.
విటమిన్ E: ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది వృద్ధాప్య లక్షణాలను తగ్గించడమే కాకుండా, మెదడు కణాలకు నష్టం జరగకుండా కాపాడుతుంది. అంతేకాక, విటమిన్ E హృదయ స్పందన రేటును నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది.
ఈ విటమిన్ల లోపాన్ని చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ ఈ చిన్న లోపాలు భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. పాలు, గుడ్లు, చేపలు, ఆకుపచ్చ కూరగాయలు, గింజలు, మరియు సూర్యకాంతి వంటి వాటిని మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గుండె మరియు మెదడు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
[