విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు కొత్త నిబంధనలు

సెప్టెంబర్ 27 నుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి
ఆలయ ప్రాంగణంలోకి సెల్‌ఫోన్లపై పూర్తి నిషేధం
భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి కూడా వర్తించనున్న రూల్స్
ఆలయ పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం ఆలయ అధికారులు కీలక నిబంధనలు జారీ చేశారు. ఆలయ పవిత్రతను కాపాడే లక్ష్యంతో సెప్టెంబర్ 27వ తేదీ నుంచి భక్తులకు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ అమలు చేయనున్నట్లు, అలాగే ఆలయంలోకి సెల్‌ఫోన్లను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) వీకే శీనా నాయక్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల కొందరు భక్తులు అసభ్యకరమైన దుస్తులతో ఆలయానికి వస్తున్నారని, మరికొందరు ఆలయ ప్రాంగణంలో వీడియోలు చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆలయ అధికారుల దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలు ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగిస్తున్నాయని భావించిన యాజమాన్యం, కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సంప్రదాయ వస్త్రధారణలో లేని భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.

ఈ కొత్త నిబంధనలు భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి కూడా వర్తిస్తాయి. విధుల్లో ఉండే ఉద్యోగులు సైతం సంప్రదాయ దుస్తులు ధరించడంతో పాటు తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను (ఐడీ కార్డులు) ధరించాలని ఆదేశించారు. ఇకపై ప్రోటోకాల్ దర్శనానికి వచ్చే ప్రముఖులు కూడా తమ సెల్‌ఫోన్లను ఆలయ కార్యాలయంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. స్కానింగ్ పాయింట్లు, టికెట్ కౌంటర్ల వద్ద తనిఖీలను మరింత కఠినతరం చేయనున్నట్లు పేర్కొన్నారు.

అమ్మవారి సేవలు, దర్శనాలు, వసతి సౌకర్యాలకు సంబంధించిన సమాచారం కోసం భక్తులు https://kanakadurgamma.org/en-in/home అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆలయ అధికారులు సూచించారు.

Leave a Comment