Marijuana door delivery in AP: ఏపీలో ఫోన్ చేస్తే గంజాయి డోర్ డెలివరీ!

Marijuana door delivery in AP: ఏపీలో( Andhra Pradesh) గంజాయి మత్తు వీడడం లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతిరోజు గంజాయి పట్టుబడుతూనే ఉంది. ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతున్నా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. గంజాయి స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో గంజాయిని సరఫరా చేస్తూనే ఉన్నారు. రోజుకో కొత్త పద్ధతిలో గంజాయిని తరలిస్తున్నారు. విక్రయాలు చేస్తున్నారు. ఫోన్ చేస్తే చాలు డోర్ డెలివరీ అన్న రీతిలో సరఫరా జరుగుతోంది అంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో పదిమంది యువకులు 10 కిలోల గంజాయితో పట్టుబడ్డారు. వారంతా 25 సంవత్సరాల లోపు వారు కావడం గమనార్హం. మరోవైపు అనంతపురంలో గంజాయిని డోర్ డెలివరీ చేస్తూ ముగ్గురు యువకులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పోలీసులు 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి పై ఉక్కు పాదం..
వాస్తవానికి కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వైసిపి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రాజ్యమేలుంది. దానికి కారణాలు లేకపోలేదు. అప్పట్లో నాసిరకం మద్యం సరఫరాతో ఎక్కువమంది సారా వైపు మొగ్గు చూపారు. గంజాయిని ఆశ్రయించిన వారు ఉన్నారు. తక్కువ మొత్తంతో ఎక్కువ నిషా ఇస్తుండడంతో యువతతో పాటు విద్యార్థులు గంజాయిని ఆశ్రయించడం ప్రారంభించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈగల్ టీం ను రంగంలోకి దించింది. ఈ విభాగం సాయంతో గంజాయి, డ్రగ్స్ సరఫరాను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. దీంతో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడుతోంది. అయినా సరే పూర్తి అదుపులోకి రావడం లేదు. ప్రధానంగా గంజాయి మూలాలు ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఒడిస్సా సరిహద్దు ప్రాంతం, మన్యంలో ఎక్కువగా గంజాయి సాగవుతోంది. అందుకే గంజాయి ఎక్కడ పట్టుబడుతున్నా.. దాని మూలాలు మాత్రం ఉత్తరాంధ్ర వైపే చూపిస్తున్నాయి.

యువతే టార్గెట్
శ్రీకాకుళం జిల్లాలో( Srikakulam district) పదిమంది యువకులు గంజాయితో పట్టు పడ్డారు. ఒడిస్సా నుంచి గంజాయిని తెచ్చి ప్యాకెట్ల రూపంలో విభజిస్తున్నారు. వాటిని స్నేహితులకు విక్రయిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ప్రాంతం గా ఉన్న పైడి భీమవరంలో పోలీసుల తనిఖీలు ఏకంగా 10 మంది పట్టుబడ్డారు. వారంతా 25 సంవత్సరాల్లోపు వారు కావడం గమనార్హం. మరోవైపు అనంతపురం జిల్లాలో గంజాయి అక్రమ సరఫరా వ్యవహారం బయటపడింది. ఇందుకోసం గంజాయి స్మగ్లర్లు ఎంచుకున్న పద్ధతిని చూసి పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. సెల్ఫోన్లో ఆర్డర్ చేస్తే గంజాయిని డెలివరీ చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఇలా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రకరకాల రూపంలో గంజాయి..
కొద్ది రోజుల కిందట విశాఖలో( Visakhapatnam) సిగరెట్ గంజాయి అందుబాటులోకి వచ్చింది. సిగరెట్ లోనే గంజాయిని అమర్చుతూ ఓ షాపు వద్ద విక్రయించడానికి పోలీసులు గుర్తించారు. మరోవైపు గంజాయి ద్రవ రూపంలో మార్చుతున్న ఘటనలు కూడా బయటపడ్డాయి. చివరకు చాక్లెట్ గంజాయి సైతం అందుబాటులోకి వచ్చింది. అయితే ఒకటి మాత్రం నిజం. కూటమి ప్రభుత్వం పట్టు బిగించిన తర్వాత మాత్రమే ఇలా గంజాయి బయటపడుతోంది. ఇప్పటికే ఒడిస్సా మన్య ప్రాంతంలో గంజాయి సాగుపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో జల్లెడ పడుతున్నారు పోలీసులు. పదుల సంఖ్యలో ఎకరాల్లో సాగుతున్న గంజాయిని ధ్వంసం చేశారు కూడా. అయినా సరే గంజాయి రవాణా అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Leave a Comment