దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో సోమవారం నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా మృతుడు ప్రణయ్ భార్య అమృత స్పందించారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగిందని, ఇప్పటినుంచైనా ఈ పరువు పేరుతో జరిగే నేరాలు ఆగుతాయని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రయాణంలో తమకు అండగా నిలిచిన పోలీస్ శాఖ, న్యాయవాదులు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. నా బిడ్డ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నేను మీడియా ముందుకు రావట్లేదని, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరారు. 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఏ2కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే.
నేరస్థులకు శిక్ష పడటంతో ప్రణయ్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అయితే తీర్పు వచ్చిన తర్వాత ప్రణయ్ భార్య అమృత్ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కూడా ఫోన్ చేశారు. ప్రణయ్ హత్య జరిగిన సమయంలో రంగనాత్ నల్గొండ ఎస్పీగా ఉన్నారు. ఆ కేసును ఆయన డీల్ చేశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, కేసు విషయంలో పలు రకాల కన్ప్యూజన్స్ క్రియేట్ అయినా ఎక్కడా కూడా ఆయన వెనకడుగు వేయలేదు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే పట్టుదలతో ఎంతో నిజాయితీ వ్యవహరించారు. దీంతో తన భర్త మరణానికి న్యాయం చేసినందుకు అమృత, రంగానాథ్‌కు ధన్యవాదలు తెలిపేందుకు ఫోన్ చేశారు.
ఇక ఈ కేసులో తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తల్లిదండ్రులు.. ప్రణయ్ సమాధి వద్ద నివాళులర్పించి, కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ కేసు విచారణలో సహకరించిన డీఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. వంద మంది సాక్షులు, 1600 పేజీల ఛార్జ్ షీట్ తో అప్పటి ఎస్పీ రంగనాథ్ నిందితులకు శిక్ష పడేలా నిక్కచ్చిగా వ్యవహరించారని కొనియాడారు. ఇక ఈ కేసులో మరణశిక్ష పడిన A2 నిందితుడు సుభాష్ శర్మను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. A3 నిందితుడు అస్గర్ అలీని గుజరాత్ సబర్మతి జైలుకు, మిగిలిన ఐదుగురు నిందితులను నల్లగొండ జైలుకు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.